Bobbili Veena : బొబ్బిలి వీణకు…కరోనా కాటు..
బొబ్బిలి వీణలపై కరోనా ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. చారిత్రకంగా ఎంతో పేరున్న కళాకారులు గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఇప్పటికే తయారైన వాటిని కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు.

Bobbili Veena
Bobbili Veena Makers Facing so many problems due to Corona : బొబ్బిలి వీణలపై కరోనా ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న లేపాక్షి దుకాణాలకు మాత్రమే వెళ్తున్నాయి. చారిత్రకంగా ఎంతో పేరున్న కళాకారులు గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఇప్పటికే తయారైన వాటిని కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా వేసవిలో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వీణల అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్మేవారు. లాక్‌డౌన్ నుంచి ఆర్డర్లు పూర్తిగా ఆగిపోయాయి. తితిదే అధికారులు ఏటా రెండు వేల వీణలు కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది లేదు.
చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, మైసూరు వంటి ప్రాంతాలు, ఎన్‌ఆర్‌ఐల నుంచి ఆర్డర్లు ఉండేవి. ఇవన్నీ ఆగిపోయాయి. మొన్నటి వరకు కరోనా తగ్గిందని కళాకారులు తయారీ పెంచారు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరగడంతో జీవనోపాధి కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముడిసరకు ధరలు పెరిగాయి.
వీణల తయారీకి వినియోగించే పనస కలప అడవి నుంచి తేవాలి. నగిషీలు దిద్దేందుకు మైనం, పాలిష్ (మెరుగు), తీగలు, లక్క ముంబయి నుంచి వస్తుంటాయి. వాటి ధరలన్నీ పెరిగాయని కళాకారులు చెబుతున్నారు.
సాధారణంగా నెమలి, ప్లెయిన్ వీణలకు డిమాండు ఎక్కువ. మృదంగం, తంబుర, డోలు సన్నాయి, వయోలిన్, సొరమండలితో పాటు తొమ్మిది నుంచి 23 ఇంచీల వీణలు తయారు చేస్తారు. వీటి ధరలు రూ.950 నుంచి రూ.3500 వరకు ఉంటాయి. కళాకారులు రోజుకు రెండు తయారు చేస్తారు. అన్ని ఖర్చులు పోనూ రూ.400 మిగులుతుంది. ప్రస్తుతం అదీ కూడా లేదని కళాకారులు వాపోతున్నారు.