బాధితులకు మేము తాగునీరు, ఆహారం, పాలు పంపిణీ చేస్తాం: బొత్స సత్యనారాయణ
వైసీపీ కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిందని..
Botsa Satyanarayana: భారీ వర్షాల కారణంగా విజయవాడ వరద బాధితులు ఆందోళనలో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి సర్కారు బాధితుల కనీస అవసరాలు తీర్చడం లేదని విమర్శించారు. వర్షాలతో వరదలు వచ్చి బాధితులు నరకం చూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
వైసీపీ కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించిందని, బుధవారం నుంచి బాధితులకు తాగునీరు, ఆహారం, పాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరదలపై ముందస్తు సమాచారం లేదా అని నిలదీశారు. వాతావరణ శాఖ నుంచి ప్రభుత్వానికి సమాచారం రాలేదా అని ప్రశ్నించారు.
సర్కారు ఏ చర్యలు తీసుకుందని, వరద అంచనాలు, హెచ్చరికలు, జాగ్రత్తలు ఏమయ్యాయని అడిగారు. కృష్ణా నది వరదపై మానిటరింగ్ ఏం చేశారని, ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమేనని అన్నారు. వర్షాలు, వరద వస్తుందని తెలిసినప్పటికీ ముందస్తుగా ఆహారం, నీరు ఎందుకు సమకూర్చుకోలేదని ప్రశ్నించారు. తమపై బురద జల్లడం తప్ప ప్రభుత్వ చర్యలు లేవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రిటర్నింగ్ వాల్ కట్టామని, అందుకే నగరానికి భారీ ముప్పు తప్పిందని అన్నారు.
ఇలాంటి విపత్తు వస్తే ఒక్క రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టకపోవడం దారుణమని బొత్స సత్యనారాయణ అన్నారు. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు తప్ప పని లేదని చెప్పారు. ఇకనైనా మాటలు మాని బాధ్యతగా వ్యవహరించాలని, వైసీపీని తిడితే తిట్టు కోండి కానీ, బాధితులకు తిండి పెట్టాలని హితవు పలికారు.
ఇంత టెక్నాలజీ పెట్టుకుని సహాయం చెయ్యలేకపోయం అని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటని చెప్పారు. అమరావతి రాజధాని గ్రామాల్లో 300 గేదెలు కొట్టుకుని పోయాయని, ఎక్కడో కొట్టుకుని పోతే ఏదో అనుకోవచ్చు.. రాజధాని ప్రాంతంలో అలాంటి పరిస్థితి అని తెలిపారు. ఈ రోజుల్లో ఏది దాయడానికి కుదరదని, చంద్రబాబు దాస్తే దాగేది కాదని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం చేయూత ఇవ్వాలని చెప్పారు. బుడమేరుకి ఉన్న 11 లాకులు ఒకే సారి ఎత్తేశారని అన్నారు.
Also Read: జగన్ కీలక సమావేశం.. వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైసీపీ