టీటీడీ సిబ్బందికి కరోనా.. అధికారులు అప్రమత్తం.. దర్శనాలపై ప్రభావం

  • Published By: vamsi ,Published On : July 5, 2020 / 02:29 PM IST
టీటీడీ సిబ్బందికి కరోనా.. అధికారులు అప్రమత్తం.. దర్శనాలపై ప్రభావం

Updated On : July 5, 2020 / 3:21 PM IST

కరోనా కారణంగా కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. భక్తులకు సేవలందించే టీటీడీ సిబ్బంది కరోనా బాధితులుగా మారడం శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపుతోంది.

ఈ క్రమంలోనే భక్తుల నుంచి నమూనాలు సేకరించినట్లే ఉద్యోగుల నుంచీ విస్తృత సంఖ్యలో నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 13 వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుండగా.. భక్తులకు అలిపిరి సమీపంలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన వారం రోజుల్లో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న 17 మంది కరోనా బారిన పడ్డారు.

అయితే భక్తుల ద్వారా సిబ్బందికి కరోనా సంక్రమించలేదని గుర్తించిన టీటీడీ.. ఉద్యోగుల నుంచీ పెద్ద సంఖ్యలో నమూనాలు సేకరించాలని నిర్ణయించింది. రోజుకు 100 మందికి స్వాబ్‌ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి కరోనా ప్రభావం భయపడాల్సిన స్థాయిలో లేదని, అలాంటి పరిస్థితే ఎదురైతే దర్శనాలపై పునరాలోచించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.