APPSC Group2 Exams: గ్రూప్ 2 పరీక్షలు యధాతథం.. స్పష్టం చేసిన APPSC
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు ఈ మేరకు సమాధానం పంపింది కమిషన్.

APPSC Group2 Exams: ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే ఆదివారం గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా జరగనున్నాయి. ఎగ్జామ్ ను వాయిదా వేయలేము అని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది కమిషన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలను తీసుకోలేమని కమిషన్ చెప్పింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు ఈ మేరకు సమాధానం పంపింది కమిషన్.
మరోవైపు గ్రూప్ 2 వాయిదా వేయమని కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాయడాన్ని తప్పు పడుతూ గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనకు దిగారు. విశాఖలో ఇసుక తోట నేషనల్ హైవేపై అభ్యర్థులు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి నిన్ననే లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల విజ్ఞప్తులను తెలియచేస్తూ పరీక్ష వాయిదా కోరుతూ లేఖ రాసింది.
Also Read : రైల్వేలో ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు TTE జాబ్‌కు అప్లయ్ చేయొచ్చు.. నెలకు రూ.80వేల వరకు జీతం..!
అసలు వివాదం ఏంటి? అభ్యర్థుల ఆందోళనలు ఎందుకు?
రోస్టర్ లో తప్పులు సరి చేయకుండా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాపోతున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలున్నాయని, వీటిని సరిచేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా కోరుతున్నారు.
రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీకి 2023 డిసెంబర్ 7న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ ఆగిపోయింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న (ఆదివారం) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. 13 ఉమ్మడి జిల్లాల్లో 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.