అయోధ్య రామ మందిరం సెట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. కల్యాణం పేరుతో భారీగా వసూళ్లు..! రూ.32లక్షలు ఖర్చు పెట్టించారంటూ బాధితుడు ఆవేదన..
అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ నన్ను మోసం చేశాడంటూ..

Garuda Ayodhya Ram Mandir
visakhapatnam: విశాఖపట్టణంలోని సాగరతీరంలో అయోధ్య రామ మందిరం సెట్ వేసి బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అచ్చం అయోధ్య మందిరాన్ని తలపించేలా ఉండటంతో విశాఖవాసులు నిజమైన ఆలయంలా భావించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీచ్ రోడ్డులోని గరుడ అనే సంస్థ ఈ సెట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సెట్ ఆధారంగా అయోధ్య పేరిట నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం అర్చకుల సమక్షంలో ఇక్కడ అయోధ్య రాముడి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ప్రచారం జరగడంతో ఈ వ్యవహారం బయటపడింది. వారి వ్యాపారంలో భద్రాచలం దేవస్థానాన్ని వాడుకోవటంపై ఆ దేవస్థానం ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెట్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ధార్మిక, హిందూ సంఘాలు ఆగ్రహం..
గరుడ అనే సంస్థ అయోధ్య రామ మందిరం సెట్ ఏర్పాటు చేసి దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉంటే.. అయోధ్య రాముడి కల్యాణోత్సవం నిమిత్తం, ఇతర కారణాలతో పెద్దమొత్తంలో నిర్వాహకులు భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సెట్‌ను తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాహకులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. భక్తులు ఫిర్యాదుచేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
అదంతా తప్పుడు ప్రచారం..
ఇంత జరుగుతున్న తమ తప్పు ఏమీలేదని నిర్వాహకులు చెబుతున్నారు. గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. కల్యాణోత్సవం కోసం భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. కావాలనే రసీదును కొందరు తప్పుడు ప్రింటింగ్ చేశారని చెప్పారు. కొండవీటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కల్యాణోత్సవంలో భద్రాచలం నుంచి తీసుకొస్తున్న బ్రాహ్మణ బృందం పాల్గొంటుందని చెప్పామే తప్ప.. భద్రాచలం దేవస్థానం పండితులచే నిర్వహిస్తున్నట్లు ఎక్కడా ప్రచారం చేయలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
వెలుగులోకి నిర్వహకులు మోసాలు..
అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వహకులు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ నన్ను మోసం చేశాడంటూ కాకినాడకు చెందిన బాధితుడు గణేష్ అవేదన వ్యక్తం చేశాడు. రూ. 32లక్షలు తనతో ఖర్చు పెట్టించి.. విశాఖలోనూ, కుంభమేళాలోనూ రామ మందిరం నమూనా సెట్‌ను నిర్వాహకుడు దుర్గ ప్రసాద్ వేశాడని గణేష్ ఆరోపించాడు. దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు. కుంభమేళాలో తన ఆరోగ్యం క్షీణించిన పట్టించుకోలేదని అన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రెండు నెలలుగా తిరుగుతున్న దుర్గ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా ఎస్పీకి గణేష్ ఫిర్యాదు చేశాడు. ప్రజలలో ఉండే భక్తిని అనువుగా చేసుకొని రామ మందిరం సెట్ వేసి కోట్ల రూపాయలను నిర్వాహకులు వెనకేసినట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.