వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు..
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్ పెంచింది.

MLA Prashanthi Reddy
Nellore politics: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్ పెంచింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిగత విమర్శలు చేశారంటూ ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న, ఇతర నేతలు మాట్లాడిన వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశారు. దీంతో కోవూరు పోలీసులు ప్రసన్నపై కేసు నమోదు చేశారు. అతనితోపాటు మరికొంత మందిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
అవినీతిలో ప్రసన్నకుమార్‌రెడ్డి పీహెచ్‌డీ చేశారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర పదజాలంతో ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి నెల్లూరు నగరంలోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడితో తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. కాగా.. మంగళవారం రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అతనితోపాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.