Obulapuram Illegal Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. గాలికి శిక్ష ఖరారు, సబితకు క్లీన్ చిట్..

ఏ 1 నుండి ఏ 7 వరకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ కోర్టు.

Obulapuram Illegal Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు.. గాలికి శిక్ష ఖరారు, సబితకు క్లీన్ చిట్..

Updated On : May 6, 2025 / 4:43 PM IST

Obulapuram Illegal Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. 14ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2గా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు. సబితతో పాటు ఏ8 కృపానందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.

ఈ కేసులో ఏ 1 నుండి ఏ 7 వరకు శిక్ష ఖరారు చేసింది కోర్టు. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అలీఖాన్‌లను దోషులుగా తేల్చింది. వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల ఫైన్ వేసింది. తీర్పు అనంతరం సీబీఐ అధికారులు నిందితులను కోర్టు నుండి జైలుకు తరలించనున్నారు.

నిందితులు..
ఏ1 B.V. శ్రీనివాస రెడ్డి
ఏ2 గాలి జనార్ధన్ రెడ్డి
ఏ3 V.D. రాజగోపాల్
ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
A7 అలీ ఖాన్ లకు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు.

ఓఎంసీ కేసులో మాజీ మంత్రి సబితకు క్లీన్ చిట్
గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు

తన వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించి తన వేసిన శిక్షను తగ్గించాలని గాలి జనార్దన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. 10 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని గాలిని ప్రశ్నించారు జడ్జి. యావజ్జీవ శిక్షకు మీరు అర్హులని గాలితో చెప్పారు జడ్జి. తన సామాజిక సేవ, ఇప్పటికే నాలుగు సంవత్సరాల పైబడి రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో శిక్ష తగ్గించాలని కోరారు గాలి జనార్దన్ రెడ్డి. బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ప్రజాసేవ చేస్తున్న నేపథ్యం తనకు ఉందని, ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు.

అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డితో పాటు అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు సీనియర్ అధికారులు నిందితులుగా ఉండటంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కనిపించింది.

Also Read: పాక్‌తో ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌, విశాఖ సహా దేశంలోని ఈ నగరాల్లో మాక్‌ డ్రిల్స్‌.. మాక్ డ్రిల్స్ అంటే ఏంటి? జనం ఏం చేయాలి?

ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(కాంగ్రెస్) చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని అనంతపురం, బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాతో పాటు ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇనుప గనులను ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్విందని సీబీఐకి ఫిర్యాదు చేసింది. అదే విధంగా ఓబుళాపురంలో ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలను చేపట్టకూడదని జీవో నెం.71ను కూడా విడుదల చేశారు. 2011లో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్‌ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఈ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సీబీఐ కోర్టులో గత నెల వాదనలు పూర్తయ్యాయి. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సీబీఐ కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది.