VV Lakshminarayana : ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

బ్లాక్ కమాండోల సెక్యూరిటీ మధ్యలో ఒకరు.. పరదాల మధ్యలో ఇంకొకరు.. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరు.. తప్పు చేసిన వాళ్లకు మద్దతిచ్చే వారు ఇంకొకరు..

VV Lakshminarayana : ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Updated On : December 23, 2023 / 12:46 AM IST

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభమైంది. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు మాజీ ఐపీఎస్, సీబీఐ ఎక్స్ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. పార్టీ అధ్యక్షుడిగా తాను, జాతీయ అధ్యక్షుడిగా చిన్నయ్య దొర వ్యవహరిస్తామని చెప్పారాయన. తమది పెట్టిన పార్టీ కాదని ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అని అన్నారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ పెట్టానని లక్ష్మీనారాయణ తెలిపారు.

ప్రత్యేక హోదా తేవడం కోసం తమ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారాయన. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగిందని వాపోయిన లక్ష్మీనారాయణ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. తప్పులు, అప్పులు చేసిన పార్టీలు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశాయన్న లక్ష్మీనారాయణ.. అందరూ చేసిన అప్పులు తీర్చి ఏపీని గుజరాత్ కంటే ముందుకు తీసుకెళ్తామన్నారు.

కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏంటి? పార్టీ పెట్టడం వెనుకున్న ఆశయం ఏంటి? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు లక్ష్మీనారాయణ. రాజకీయ పార్టీ ప్రకటన అనంతరం మాట్లాడిన లక్ష్మీనారాయణ కీలక, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”నేడు రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద సమస్య గా మారింది. రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి, నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. కేంద్రం మెడలు వంచుతామనే పార్టీలు సాధించలేకపోయాయి. మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం. నేడు ఉన్న రాజకీయ పార్టీలు దోపిడీ ఎలా చేయాలో ఆలోచిస్తాయి తప్ప ప్రజలకి సేవ చేయడం మరిచాయి. ఎవరూ తినలేని, అవినీతి లేని పార్టీ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిందే జై భారత్ పార్టీ.

అభివృద్ధి అని కొందరు అవసరాన్ని పక్కన పెట్టారు. మరొకరు అవసరాలు అని అభివృద్ధిని పక్కన పెట్టారు. అభివృద్ధి చేస్తూ అవసరాలు తీర్చే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. డాలర్ కి సమానంగా రూపాయి ఉండేది. నేడు పరిస్థితి దారుణం. ప్రజాస్వామ్యం కోసం వెతుక్కొనే పరిస్థితి నేడు ఉంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి భద్రతలను కాపాడడానికి పెట్టిన పార్టీ ఇది.

వెయ్యి కిలో మీటర్ల సముద్ర తీరం మనకు ఉంది. గ్రామాల్లో పరిశ్రమలు స్థాపిస్తే, ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత పక్క రాష్ట్రానికి పోదు. వైజాగ్ లో జాబ్ మేళా పెడితే 70 శాతం మంది నిరుద్యోగులు వచ్చారు. అందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే. రాజకీయాలు కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యాయి. దేశంలో రాజకీయాలు కుటుంబ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాయి” అని లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.

మాజీ సీఎం చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పైనా పరోక్ష విమర్శలు చేశారు లక్ష్మీనారాయణ. ”బ్లాక్ కమాండోల సెక్యూరిటీ మధ్యలో ఒకరు.. పరదాల మధ్యలో ఇంకొకరు.. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరు.. తప్పు చేసిన వాళ్లకు మద్దతిచ్చే వారు ఇంకొకరు” అని విమర్శలు గుప్పించారు.

”మేము తప్పు చేయం. అప్పు చేయం. తప్పు చేసిన వారికి అండగా నిలవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కంటే ముందుకు తీసుకెళతాం. రాష్ట్రం చీకటిలో ఉంటే నేను పెట్టే చిరు దీపం చూడడానికి మా అమ్మ వచ్చారు. రాష్ట్రం చీకట్లో ఉంది. చిరు దీపం మేము వెలిగిస్తున్నాం.
పార్టీ వివరాలతో ఒక వెబ్ సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం. ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లాడమే నా ఆశయం.

రాబోయే ఎన్నికల్లో ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుంది. అవినీతి చేయడానికి ప్రధాన కారణం చట్టాలు. కొత్త‌ చట్టాలు తెస్తే అవినీతికి ఆస్కారం ఉండదు. యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వచ్చే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఆ విశ్వాసాన్ని కల్పిస్తుంది.
జై భారత్ నేషనల్‌ పార్టీ మా కాళ్లపైన నిలబడే పార్టీ. పొత్తులతో మాకు సంబంధం లేదు. మా‌ కాళ్లపైనే మేము నిలబడతాం. రాజకీయాలు చేయాలంటే డబ్బులు కావాలి. రాజనీతి కావాలంటే డబ్బులు అవసరం లేదు. ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే విధంగా మా మ్యానిఫెస్టో ఉంటుంది” అని లక్ష్మీనారాయణ తెలిపారు.