రీసైక్లింగ్‌పై మొబైల్ వాహనం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించండి.. ముఖ్యమంత్రి చంద్రబాబు
రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

CM Chandrababu Naidu: రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజధాని ప్రాంతంలోని అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను సీఎం కు కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య
వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. రీసైక్లింగ్ పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, కాలుష్య నియంత్రణ మండలి శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతీ 15రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై తనకు నివేదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టడంతోపాటు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్రమోడీ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మియావకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావకీ విధానాలపై దృష్టి సారించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.