చంద్రబాబుకు పాక్ ప్రధానిపైనే నమ్మకం ఎక్కువ

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2019 / 02:13 PM IST
చంద్రబాబుకు పాక్ ప్రధానిపైనే నమ్మకం ఎక్కువ

Updated On : February 21, 2019 / 2:13 PM IST

జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు.  పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అమరులకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. మోడీ హయాంలో దేశ భధ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై,రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాక్  ప్రధానిని  నమ్ముతాడని, భారత ప్రధాని మీద ఆయనకు నమ్మకం లేదని అన్నారు. రాజకీయాలకు కూడా హద్దు ఉండాలన్నారు. సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు.

చంద్రబాబు ఢిల్లీ,కోల్ కతా వెళ్లి ధర్నాలు చేశారని,ధర్నా చేయాల్సింది టీడీపీ పార్టీ ముందే అని షా అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో తెలంగాణలో కూటమి ఏర్పాటుచేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు అవినీతి,కుటుంబ పార్టీలేనన్నారు. ఏపీకి 90శాతం హామీలను నెరవేర్చినట్లు చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించడంతో దేశమంతా విషాదంలో మునిగితే ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రం షూటింగ్‌లో కొనసాగారని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ..జవాన్లపై ఉగ్రదాడి జరిగిన రోజే ప్రధాని స్పందించాడని, కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడని,అటువంటి వ్యక్తిపై ఎలా నిందలేస్తారని షా ప్రశ్నించారు. దేశం కోసం రోజులో 18గంటలు పని చేస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.దేశం పట్ల మోడీకి ఎంతో గౌరవం ఉందని,ఇటువంటి చిల్లర వ్యాఖ్యలను చేసే కాంగ్రెస్ ను దేశ ప్రజలు పట్టించుకోరని అన్నారు.మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కాశ్మీర్ సమస్యకు కారణమని, పటేల్ మొదటి దేశ ప్రధాని అయి ఉంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదన్నారు.అంతకుముందు క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర పార్టీ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు.