Chintamaneni: భుజాలపై ఎక్కించుకుని పవన్ కల్యాణ్ ను గెలిపిస్తా.. చింతమనేని కీలక వ్యాఖ్యలు

వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Chintamaneni: భుజాలపై ఎక్కించుకుని పవన్ కల్యాణ్ ను గెలిపిస్తా.. చింతమనేని కీలక వ్యాఖ్యలు

chintamaneni prabhakar, pawan Kalyan

Chintamaneni Prabhakar : దెందులూరు టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దెందులూరు సీటును పవన్ కల్యాణ్ (pawan kalyan) కోసం త్యాగం చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నిజంగా దెందులూరు(denduluru) కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. పొత్తులపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతానని స్పష్టం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జ్ ల సమావేశానికి చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ధ్వజమెత్తారు. తమ పార్టీ మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బస్సుయాత్రలు చేపడుతున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించే పవన్ కల్యాణ్ మాట్లాతున్నారని చెప్పారు. పవన్ కోసం తన సీటును త్యాగం చేయాల్సివస్తే అందుకు తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. భుజాలపై ఎక్కించుకుని పవన్ కల్యాణ్ ను గెలిపిస్తామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. సీట్లు, పొత్తుల విషయంలో చంద్రబాబుదే తుదినిర్ణయమని.. దెందులూరు సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుల గురించి అడగ్గా.. తనను వివాదాల్లోకి లాగొద్దు అంటూ జవాబిచ్చారు. కాగా, చింతమనేని తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read: ఆ రోజు నేను నోరు విప్పి ఉంటే ఇతడు ఉండేవాడు కాదు: పవన్ కల్యాణ్

మరోవైపు వారాహి విజయ యాత్ర (varahi vijaya yatra) పేరుతో జనసేన పార్టీ (janasena party) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాకినాడలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా అధికార వైసీపీ నాయకులు, ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Also Read: ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను: చంద్రబాబు నాయుడు