Chandrababu Naidu: ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను: చంద్రబాబు
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.

Chandrababu Naidu
Chandrababu Naidu – TDP: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఘోరాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ (YCP) ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) వైఖరి, ప్రభుత్వ అసమర్థత కారణంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పారు.
గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు ఘటనలు చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని తెలిపారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో ఓ బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. ఏపీలో గంజాయి, గన్ కల్చర్ పెరిగిపోతున్నాయని చెప్పారు.
నవ్యాంధ్ర ప్రజలు సీఎం జగన్ పాలనలో ప్రతిరోజు అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని తెలిపారు. మహిళలపై వేధింపులు ఇంతగా జరుగుతుంటే జగన్ సర్కారు కఠిన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
అనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ… కబ్జా దారులను ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. విశాఖ పట్నంలో ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, ఎంపీ కుమారుడి ఇంట్లోనే రెండు రోజులు పాటు బందీలుగా పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసిందని తెలిపారు.
వైసీపీ నేతలు పెంచి పోషించిన గూండాలే కిడ్నాప్ చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఉందో ప్రతి పౌరుడు ఆలోచించాలని అన్నారు. జగన్ ఏ ఒక్క ఘటనలో కూడా బాధితులను పరామర్శించలేదని చెప్పారు.