మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై Si దాడిలో యువకుడి మృతి: విచారణకు ఆదేశించిన సీఎం జగన్

ఇసుక లారీని అడ్డుకున్నాడని పోలీసుల కళ్లముందే ఓ దళిత యువకుడికి గుండు గీయించి విచక్షణారహితంగా కొట్టిన ఘటన తీవ్రకలకలం రేపింది. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని ఎస్సై చితకబాదటంతో అతను దెబ్బలుతాళలేక ప్రాణాలు కోల్పోయిన దారుణం ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే..చీరాల రేషన్ డీలర్ మోహన్ రావు కొడుకు కిరణ్ కుమార్ మూడు రోజుల క్రితం తన ఫ్రెండ్స్ తో కలిసి బైక్ మీద బైటకెళ్లాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్సై విజయ్‌కుమార్ వారిని ఆపాడు. మాస్క్ పెట్టుకోలేదని ప్రశ్నించారు. కానీ కిరణ్ సమాధానం చెప్పేలోపే అతనిపై దాడికి దిగాడని..లాఠీతో దారుణంగా చితకబాదాడు. దెబ్బలు తాళలేకి కిరణ్ స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతనిని తోటి స్నేహితులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ కిరణ్ బుధవారం (జులై 22,2020)న ప్రాణాలు కోల్పోయాడు.దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసుల దెబ్బల వల్లనే కిరణ్ చనిపోయాడని ఆరోపిస్తు..ఎసై విజయ్ కుమార్‌పై SI పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా..ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా ఎస్పీని సీఎ కార్యాలయం (CMO Office) ఆదేశించింది. ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా..ఈ ఘటనపై పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అంటున్నారు. బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు మద్యం సేవించారనీ..చెక్కింగ్ ల్లో భాగంగా..ప్రశ్నించిన పోలీసులను వారు దూషించారని ..ఎస్సై విజయ్ కుమార్ వారిని పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పోలీస్ వాహనం నుంచి కిరణ్ బయటకు దూకాడని వెల్లడించారు.
దీంతో కిరణ్ తలకు గాయాలయ్యాయనీ అంతే తప్ప ఎస్సై వారిపై దాడి చేయటం అనటం వాస్తవం కాదని అంటున్నారు.గాపడిని కిరణ్ ను పోలీసులే గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందాడని అంటున్నారు. కిరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎస్సై విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు సంబంధించి కందుకూరు డీఎస్పీని విచారణ అధికారిగా నియమించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. కానీ కిరణ్ తండ్రి మాత్రం ఇదంతా పోలీసులు కావాలనే కేసును తారు మారు చేసి పోలీసులపైకి రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.