Heavy Rains : చిత్తూరు జిల్లాకు రూ.500 కోట్ల నష్టం

ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అనేక మంది ప్రాణాలు కోల్పోగా, కొందరు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించింది.

Heavy Rains : చిత్తూరు జిల్లాకు రూ.500 కోట్ల నష్టం

Heavy Rains

Updated On : November 20, 2021 / 10:14 AM IST

Heavy Rains : ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అనేక మంది ప్రాణాలు కోల్పోగా, కొందరు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగి పడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు రాకపోకలు ఒకే మార్గం నుంచి జరుగుతున్నాయి. ఇక జిల్లాలో వర్షాల కారణంగా రూ.500 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు అధికారులు. జిల్లాలో ఇంకా పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Srikalahasti (1)

వర్షానికి 8,000 ఎకరాల వరిపంటతోపాటు 6,000 ఎకరాల ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 1,550 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతినట్లుగా తెలుస్తోంది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. బ్రిడ్జ్ లు కూలిపోయాయి. ఇక 295 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం కాగా 223 చెరువులకు గండిపడింది.. దీంతో మూడు వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ఎనిమిది మంది గల్లంతు కాగా నలుగురు మృతి చెందారు. జిల్లాలోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.

Srikalahasti (2)

లోతట్టుప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. రెండు వేల రూపాయలు అందించారు. వర్షాల కారణంగా ఎవరైనా మృతి చెందిందితే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో కంటే కడప జిల్లాలో వర్షాల కారణంగా అధికమంది మరణించారు. కడప జిల్లాలో సుమారు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంతో వరద నీరు గ్రామాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో సుమారు 50 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వర్షాల దాటికి కడప జిల్లా కకావికలమైంది.

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వర్ణముఖీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.