కోడెల కుమారుడికి పెత్తనం ఇస్తే పార్టీ వీడతాం, చంద్రబాబుకి సత్తెనపల్లి తమ్ముళ్ల వార్నింగ్

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 03:45 PM IST
కోడెల కుమారుడికి పెత్తనం ఇస్తే పార్టీ వీడతాం, చంద్రబాబుకి సత్తెనపల్లి తమ్ముళ్ల వార్నింగ్

Updated On : November 7, 2020 / 3:54 PM IST

Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం కోడెల కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టడంతో కొద్ది నెలలకే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నడిపించే నాయకుడు లేకుండా పోయారు.

టీడీపీ నేతలకు దగ్గరయ్యేందుకు కోడెల శివరాం ప్రయత్నాలు:
కోడెల కుమారుడు శివరాంపై పలు కేసులు ఉండటంతో పార్టీకి దూరమై మౌనం దాల్చారు. అడపాదడపా నియోజకవర్గంలో ప్రత్యక్షమైనప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఇటీవల కోడెల శివరాం నియోజకవర్గంలో ప్రత్యక్షమై టీడీపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోడెల శివరాం కారణంగా ఐదేళ్లపాటు తీవ్రమైన ఇబ్బందులను చవిచూసిన టీడీపీ స్థానిక నేతలు ఈ పరిణామాలను ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.

పార్టీ వీడి వెళ్లిపోతామని సీనియర్లు వార్నింగ్:
పార్టీపై కోడెల శివరాం పెత్తనంపై, పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీలో ఎలాంటి పదవి లేని శివరాం, నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని స్థానిక నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కోడెల శివప్రసాద్ కుమారుడు, కుమార్తెల తీరుతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, భవిష్యత్‌లో వారి నాయకత్వాన్ని తిరిగి తమపై రుద్దే ప్రయత్నం చేస్తే పార్టీని వీడి వెళ్లిపోతామంటూ వారంతా హెచ్చరికలు జారీ చేస్తున్నారట.

కోడెల కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించిందే తప్ప కేడర్‌ను పట్టించుకోలేదు:
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కోడెల కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించిందే తప్ప పార్టీ కేడర్‌ను ఏమాత్రం పట్టించుకోలేదన్న వాదనలను స్థానిక నేతలు లేవనెత్తుతున్నారు. కోడెల శివరాం చర్యల వల్ల దెబ్బతిన్న పార్టీ, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా తిరిగి శివరాం సత్తెనపల్లి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత నియోజవకర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరమైన శివరాం.. ఇప్పుడు మళ్లీ కార్యకర్తలను పిలిపించుకోవడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గత ఎన్నికల్లో కోడెల కుటుంబ సభ్యుల వల్ల నష్టపోయిన కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని వారంతా ప్రశ్నిస్తున్నారు.


అంబటి లాంటి బలమైన నేతలను ఎదుర్కోవాలంటే కోడెల శివరాం లాంటి యువకుని వల్లే సాధ్యం:
సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితిని అటు పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పార్టీ కేడర్ చెక్కు చెదరలేదు. అయితే, అక్కడి నుంచి వైసీపీ నుంచి గెలుపొందిన అంబటి రాంబాబు, ఆయన సోదరుల ఆగడాలను ఎదుర్కొనే సరైన నాయకుడు టీడీపీకి లేకపోవటం ఆ నియోజకర్గానికి లోటుగా మారినట్లు పార్టీ భావిస్తోందని అంటున్నారు. కోడెల మరణంతో నియోజకవర్గంలో టీడీపీపై కొంతమేర సానుభూతి కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో అంబటి లాంటి బలమైన నేతలను ఎదుర్కోవాలంటే కోడెల తనయుడు శివరాం లాంటి యువకుని వల్లే సాధ్యమని పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

కోడెల శివరాం నాయకత్వం వైపే మొగ్గు:
టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, తనయుడు లోకేశ్‌ సైతం సత్తెనపల్లిలో కోడెల శివరాం నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారని టాక్‌. కోడెల మరణం నేపథ్యంలో ఆయన లోటును కోడెల కుమారుడి ద్వారానే భర్తీ చేయటం సరైందన్న అభిప్రాయంలో పార్టీ అధినేత ఉన్నట్లు సమాచారం. గతంలో చోటుచేసుకున్న తప్పులు భవిష్యత్‌లో దొర్లకుండా చూస్తానని చంద్రబాబుకు ఇప్పటికే కోడెల శివరాం మాట ఇచ్చారని అంటున్నారు. ఇకపై తన తండ్రి పని చేసినట్టే పార్టీ కేడర్ కోసం పని చేస్తూ వైసీపీ అక్రమాలపై పోరాటాలు చేస్తానని అధినేతకు స్పష్టం చేశారట.

శివరాం పెత్తనం అడ్డుకునేందుకు ఆలపాటి రాజా వర్గం ప్రయత్నాలు:
నియోజకవర్గంలో పార్టీకి చెందిన నేతలకు సైతం ఇదే విషయాన్ని శివరాం స్పష్టం చేస్తున్నారట. గతంలో చోటుచేసుకున్న తప్పులు, పొరపాట్లు ఇకపై చేయబోనంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాల్లో శివరాం తలమునకలయ్యారని అంటున్నారు. సత్తెనపల్లి టీడీపీలో కోడెల శివరాం పెత్తనం చేయకుండా అడ్డుకునేందుకు సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా వర్గం తీవ్రస్ధాయిలో ప్రయత్నాలు చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజా తన అనుచరుడైన అబ్బూరి మల్లేశ్వరరావుకు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇప్పించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

తెరవెనుక పావులు కదుపుతున్న ఆలపాటి రాజాతో, రాయపాటి వర్గం :
శివప్రసాదరావు బతికున్న సమయంలోనే తన అనుచరుడు మల్లితో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసి 2019 ఎన్నికల్లో కోడెలకు టికెట్‌ ఇవ్వొద్దంటూ నిరసన ప్రదర్శనలు చేయించటం వెనుక రాజా పాత్ర ఉందనే టాక్‌ వచ్చింది. కోడెల ఓటమికి పరోక్షంగా ఆలపాటి రాజా కారణమని అంటారు. ఈ క్రమంలోనే ఆలపాటి రాజాతోపాటు, రాయపాటి వర్గం సైతం తెరవెనుక పావులు కదుపుతూ కోడెల తనయుడు శివరాం పెత్తనం లేకుండా చేసేందుకు ఓ వర్గాన్ని ఎగదోస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఇంచార్జి బాధ్యతల కోసం రాయపాటి కుమారుడి ప్రయత్నాలు:
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల కోసం ఎప్పటి నుంచో రాయపాటి కుమారుడు రంగారావు ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత చంద్రబాబు మాత్రం తన మనసులో ఏముందో బయటపెట్టకుండా ఆ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. తాజాగా శివరాం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారటం చూస్తుంటే పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ అధినేత స్వయంగా ప్రకటించేంత వరకూ ఈ ప్రచారాలు తప్పవని అంటున్నారు.