విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు.

Visakha Steel Plant (Photo Credit : Google)
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మేమే అడ్డుకున్నామని గుర్తు చేశారు.
ఈరోజు కేంద్రమంత్రి కుమార స్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు. ప్లాంట్ ను ఎలా కాపాడుకోగలమో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీయే కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరం అని చంద్రబాబు చెప్పారు.
”వేల కోట్ల రూపాయలు చారిటీగా ఇచ్చి ఎవరూ బెయిల్ ఔట్ చేయలేరు. అందరం కలిసి ముందుకెళ్లాలి. కార్మిక నేతలు గుర్తించాలి. మెడికల్ కాలేజీల విషయంలో కూడా వాళ్ళు ఇచ్చిన జీవో ఏంటో అందరికీ వివరిస్తా. త్రేతాయుగం నుంచి.. యజ్ఞాలను చెడగొట్టే రాక్షసులు ఎప్పుడూ ఉంటూనే అంటారు. రూ.300 కోట్లు సీఎంఆర్ఎఫ్ కు విరాళం వచ్చింది. ఇంకా 100, 150 కోట్లు విరాళం రావచ్చు. ఈ సాయం ఇళ్లలో ఉన్నవారికి వస్తుంది. రెంట్ తీసుకున్న వారికి వస్తుంది. ఓనర్ కు కాదు” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఐదేళ్లూ ఏం చేశారు- సీఎం చంద్రబాబు
”విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. కేంద్రమంత్రులతో ఇప్పటికే మాట్లాడాను. ప్లాంట్ కు కావాల్సిన నిధులను విడుదల చేయిస్తాం. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పని చేద్దాం. గతంలో స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ వెళ్లి మాటాడదాం రమ్మంటే వైఎస్ జగన్ రాలేదు. అధికారంలో ఉండగా ఐదేళ్లూ మాట్లాడని వైసీపీ.. ఇప్పుడు మాపై విమర్శలు చేస్తోంది” అని నిప్పులు చెరిగారు చంద్రబాబు.
అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలనూ మార్చాల్సి వస్తుంది- సీఎం చంద్రబాబు
”కృష్ణా నదికి వరద వస్తే అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. విశాఖలో హుదూద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాల్లో వరదల్లో మునగలేదా? వరద వస్తే ఏ ప్రాంతమైనా మునగాల్సిందే. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలనూ మార్చాల్సి వస్తుంది. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేది” అని వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Also Read : అలా అడ్డంగా బుక్ అయిపోతే ఎలా? వీళ్లు తప్పు చేశారా? తప్పించుకోలేక దొరికిపోయారా?