మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పట్టణాల్లో భారీ వర్షాల కారణంగా..

మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. : సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu

Updated On : August 31, 2024 / 12:59 PM IST

AP Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూల్ పర్యటన రద్దయింది. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతుంది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీటితో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తీవ్రత తగ్గేవరకు ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read : Heavy Rains : విజయవాడలో కుండపోత వర్షం.. బయటకు రావొద్దంటూ ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని, పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులకు లోకేశ్ విజ్ఞప్తి..
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని, విపత్తుల కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని లోకేశ్ కోరారు.