Quantum Test Beds: ఏపీలో నవశకం.. రేపు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ప్రారంభం..
ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఎస్, వన్ క్యూ పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు.
Quantum Test Beds: భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (ఏప్రిల్ 14) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రెండు కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంతో దేశంలోని క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.
అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలతో రాష్ట్రంలో నూతన సాంకేతిక శకానికి నాంది పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 1S, 1Q పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే అత్యంత కీలకమైన సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి లభిస్తుంది.
మేధా టవర్స్ లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మరో కేంద్రం ఏర్పాటు అవుతోంది. దీంతో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించబోతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఫ్యూచర్ మొత్తం ఇక్కడే ఉందని, దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుందని ఆయన చెప్పారు. మైనస్ 273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పని చేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనల్లో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. దీని వల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
ఈ రెండు క్వాంటం రిఫరెన్స్ ఫెసెలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే వినియోగిస్తున్నారు. మేధా టవర్స్ లో క్యూబిటెక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్ డీవో లాంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తి సహకారం అందించాయి.
ఈ చరిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు, ఇన్నోవేషన్ స్టార్టప్ ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
