ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ఎంతకైనా తెగిస్తుంది: చంద్రబాబు 

  • Published By: chvmurthy ,Published On : April 6, 2019 / 05:53 AM IST
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ఎంతకైనా తెగిస్తుంది: చంద్రబాబు 

Updated On : April 6, 2019 / 5:53 AM IST

అమరావతి:  పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గెలుపు ఏకపక్షం అనేది దేశం మొత్తం తెలిసిపోయిందని, ఫ్రస్టేషన్ తోనే నరేంద్రమోది, అమిత్ షా కక్షసాధింపులకు  పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రోజు రోజుకూ బిజెపి, వైసిపి  చేసే తప్పుడు పనులు పెచ్చుమీరాయని, దర్యాప్తు సంస్థలనే కాక ఈసీని కూడా దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

తప్పుడు మార్గాలతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తో కలిసి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. “కేసుల భయం చూపి జగన్ ను బిజెపి లొంగదీసుకుంది” “కేసుల మాఫీ కోసం మోదికి వైసిపిని జగన్ తాకట్టు పెట్టాడు” “ఆస్తులు కాపాడుకోడానికి కేసీఆర్ కు  వైసీపీని అమ్మేశాడు” ఎన్నికలయ్యాక వైసీపీని బీజీపీలో కలిపేయడం ఖాయం అని  బాబు జోస్యం చెప్పారు. వైసీపీలో  సగం మంది అభ్యర్ధులు నేరచరితులే ఉన్నారని, 12మంది ఎంపీ అభ్యర్ధులు, 92మంది ఎమ్యెల్యే అభ్యర్ధులపై  వివిధ కేసులు నమోదై ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి అని కార్యకర్తలను బాబు హెచ్చరించారు.