YSR Rythu Bharosa : రైతులకు సీఎం జగన్ శుభవార్త, ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7,500

కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాత‌లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

YSR Rythu Bharosa : రైతులకు సీఎం జగన్ శుభవార్త, ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7,500

Ysr Rythu Bharosa

Updated On : May 13, 2021 / 7:00 AM IST

YSR Rythu Bharosa : కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. అన్నదాత‌లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖ‌రీఫ్ పంట‌ కాలానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడత సాయాన్ని గురువారం (మే 13,2021) రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు సీఎం జగన్. తొలి విడతగా 52.38 లక్షల రైతులకు రూ.3,882.23 కోట్లు సాయం అందించనున్నారు.

కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. ఇది మూడు విడతలుగా ఇవ్వనుంది ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ, జనవరి నెలలో రూ. 2,000 జమ చేయనుంది.

ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు ప్రతి ఏడాది రూ. 13,500 లబ్ధి చేకూరుతోంది. ఈ డబ్బులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 7,500 ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం(ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం) రూ.6 వేలు ఇస్తోంది. కాగా, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అద‌నంగా మ‌రికొంత‌మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

కరోనా నేపధ్యంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కింద మొదటి విడత సాయంగా నేడు అందిస్తున్న రూ.3,882.23 కోట్లతో పాటు మే నెలలోనే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద మరో రూ. 2,000 కోట్లలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద 2019-20 నుంచి ఇప్పటివరకు రైతులకు రూ. 13,101 కోట్ల సాయం, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి మొత్తం రైతు భరోసా సాయం రూ.16,983.23 కోట్లకు చేరనుంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఏటా రూ. 13,500 సాయం ఆందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఏటా ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఏటా రూ. 13,500 చొప్పున ఐదేళ్లపాటు రూ.67,500 అందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల కింద రైతులకు ఇప్పటివరకు రూ. 67,953.76 కోట్లు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ పథకం కింద అర్హులను ప్రభుత్వం గుర్తించింది.