Jagan Meeting: టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా? వాయిదా వేస్తారా?

Jagan Meeting
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు సమావేశం కానున్నారు. కరోనా వైరస్ విజృంభణను అదుపు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు చర్చించే అవకాశముంది.
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఇప్పటికే కమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కట్టడి కోసం ఏపీలో ఎటువంటి ఆంక్షలు పెట్టాలనేదానిపై అధికారులతో ఈ రోజు భేటీలో చర్చించే అవకాశముంది. ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించినా, కరోనా ఉద్ధృతితో సర్కారు పునరాలోచనలో పడింది. దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా? వాయిదా వేయాలా? అనే అంశంపై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో వ్యాపార సంస్థలు మూసివేశారు. వ్యాపార వేళల్లో కూడా మార్పులు చేశారు. విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు వస్తుండడంతో పదో తరగతి పరీక్షలు రద్దుచేసి, స్కూళ్లకు సెలవులు ప్రకటించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.