CM Jagan : సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ఇవాళ బ్రేక్.. మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం

సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్..

CM Jagan : సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ఇవాళ బ్రేక్.. మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం

Jagan Bus Yatra : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ తలపెట్టిన బస్సు యాత్ర 20వ రోజు (ఆదివారం) విశాఖ జిల్లాలో కొనసాగింది. విశాఖ ప్రజలు జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. సాగర నగరం జనసంద్రంగా మారింది. ఆదివారం చిన్నయ్యపాలెం మీదుగా ఎండాడ వరకు బస్సు యాత్ర సాగింది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన జగన్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలను కోరారు.

Also Read : Vontimitta : ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కల్యాణం.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తులు ఇలా చేరుకోవచ్చు

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఇవాళ (సోమవారం) మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్.. ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మ్యానిఫెస్టోలో పొందుపర్చే అంశాలు, మూడో విడత ప్రచారం పై చర్చించనున్నారు. ఇవాళ మ్యానిఫెస్టోను ఫైనల్ చేయనున్న జగన్.. ఈనెల 27 లేదా 28 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని హామీలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాలకు మేలుకలిగేలా మ్యానిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 25న నామినేషన్ ను దాఖలు చేయనుండగా.. ఆ తరువాతే మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చంద్రబాబు చదివి వెళ్లారు: కాకాణి

గత ఎన్నికల్లో నవరత్రాల హామీతో సీఎం జగన్ సత్తాచాటారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జగన్ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఐదేళ్లలో ఇంటింటి సంక్షేమ పథకాలు అందించామని, ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని, గత ఎన్నికల్లో ఇచ్చిన 99శాతం హామీలను అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా సీఎం జగన్ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి సీఎం జగన్ ఎలాంటి హామీలిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు.