నిమ్మగడ్డతో తగ్గాడు…. మూడు రాజధానులతో నెగ్గాడు

ఏపీ మూడు రాజధానుల బిల్లుపై చిక్కుముడిపడింది. గవర్నర్ చేతిలోనే బిల్లు భవిష్యత్తు ఉంది. ఆయనేం చేస్తారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త సారధి వచ్చాడు… అమరావతిలోనే పాలనా రాజధాని ఉండాలన్నది మా విధానం అని స్టాండ్ ను క్లియర్ చేయడంతోనే కొత్త సందిగ్ధత నెలకొంది. మరింత అయోమయంగా మారింది.
కొంతకాలం సాగతీసి… జగన్ ను లొంగదీసుకొంటారన్న రాజకీయ అంచనాల మధ్య జగన్ చక్రం తిప్పారు. కేంద్రంతో జగన్ మాట్లాడారు. గవర్నర్ వేగంగా నిర్ణయం తీసుకొనేలా మంత్రాంగం నడిపారు. ఏదీ పైకి కనిపించలేదు. కానీ చివరకు మాస్టర్ స్ట్రోక్ కొట్టారు.
మండలి పంచాయితీ తేలకముందే మూడు రాజధానుల బిల్లును గవర్నర్ దగ్గరకు పంపించడంతోనే జగన్ తన ఉద్దేశాన్ని బైటపెట్టారు. దూకుడు చూపించారు. కేంద్రం నుంచి నరుక్కొని వచ్చారు. గవర్నర్ దగ్గరకు బుగ్గనను పంపించి…తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజకీయంగా బీజేపీ తన స్టాండ్ ను స్పష్టంగా చెప్పించారు. బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు కూడా మూడు రాజధానులు వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఉండబోదని తేల్చేశారు.
ఒక విధంగా అమరావతే రాజధానిగా ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సుజనా చౌదరికి అడ్డుకట్టవేశారు. కేంద్రం, బీజేపీ రెండింటి విధానాలూ ఒక్కటే కాబట్టి… గవర్నర్‌కు ఎలాంటి ఇబ్బందిలేదు. అందుకే ఆమోదముద్ర వేశారు. అర్ధరాత్రి ఉత్తర్వులతో నిమ్మగడ్డను నియమించి తగ్గినట్లు కనిపించిన జగన్, మూడు రాజధానుల బిల్లును ఓకే చేయించుకోవడంతో బాగా స్కోర్ చేశారు.