CM Jagan Prakasam Tour : ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌

CM Jagan Prakasam Tour : ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Ys Jagan Mohan Reddy

Updated On : April 22, 2022 / 9:31 AM IST

CM Jagan Prakasam Tour :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు మూడవ విడతకు సంభందించి ఒక్క బటన్ తో 1,02,16,410 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా 1261.06 కోట్ల రూపాయలను జమా కానుంది.

ఆ తర్వాత బందర్‌ రోడ్‌లోని రవిప్రియ మాల్‌ అధినేత కంది రవిశంకర్‌ నివాసానికి వెళతారు. వారింట్లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా ఒంగోలులో భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు స్థానిక ఏబీయం కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో సీఎం దిగుతారు. అక్కడ పావుగంట పాటు అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. 10.30 గంటలకు పీవీఆర్‌ బాలుర హైస్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు.

ఏబీయం కాలేజీ వద్ద నుంచి చర్చిసెంటర్, గవర్నర్‌ రోడ్డు, కోర్టు స్ట్రీట్, పోలేరమ్మ ఆలయం రోడ్డు మీదుగా సభావేదికకు వెళ్లే మార్గంలో బ్యారికేడ్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నూతన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. గురువారం సాయంత్రం పోలీసులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 2,013 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మలికాగర్గ్‌ పర్యవేక్షించారు.

సభాస్థలిలో 9 వేల మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాట్లు చేశారు. ముూడు జిల్లాలనుంచి సుమారు 40 వేల మందిని సభకు తీసుకువచ్చేందుకు వైసీపీ కీలక నాయకులు జనసమీకరణ చేపడుతున్నారు. సభా స్ధలిలో స్వయం సహాయక సంఘాలతో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సభకు వచ్చిన వారి కోసం భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. తాగునీటితో పాటు మొబైల్‌ టాయిలెట్ల సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భారీ కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ఇతరులకు ప్రత్యేక ద్వారాలు సిద్ధం చేశారు.
Also Read : Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర
ఏర్పాట్లను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తదితరులు పర్యవేక్షించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.