ఎమ్మెల్యే కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వివాదం..రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న అనుచరులు

ఎమ్మెల్యే కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వివాదం..రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న అనుచరులు

Updated On : December 24, 2020 / 7:41 PM IST

Controversy between MLA Kethireddy and JC Prabhakarreddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌… వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. తాడపత్రి తాజా, మాజీ ఎమ్మెల్యే అచరుల మధ్య గొడవకు కారణమైంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు… దాడికి దిగడంతో…జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు కూడా ప్రతిదాడికి దిగారు. దీంతో తాడిపత్రిలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరు వర్గాల రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరస్పర దాడులతో తాడిపత్రి రణరంగంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి తమ ఎమ్మెల్యే కేతిరెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారని ఆరోపిస్తూ.. వైసీపీ కార్యకర్తలు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో వచ్చారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తారా అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా… జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రాళ్లతో ఇంటిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న దాసరి కిరణ్‌ అనే యువకుడిని చితకబాదారు. కేతిరెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్‌ చేస్తావా అంటూ దాడి చేశారు. రెండు రోజుల్లో తాడిపత్రి విడిచి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే కేతిరెడ్డి అనుచరులు తాడి చేసిన సమయంలో ఇంట్లో జేపీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేరు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాచేసిన చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు.. అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. ఎదురొచ్చిన వారిని చితకబాదుతూ వీరంగం సృష్టించారు. ఈ సమాచారం తెలుసుకన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రికి రాగా…. ఆయన కారుపైనా కేతిరెడ్డి అనుచరులు రాళ్లు విసిరారు. దీంతో జేసీ వర్గీయులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల పరస్పర దాడులతో తాడిపత్రి రణరంగంగా మారింది. అయితే పోలీసుల భద్రత నడుమ జేసీ , ఆయన తనయుడు తమ ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుల గొడవపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా, మాజీ ఎమ్మెల్యే మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో స్థానిక ఎస్సై, సీఐలు తమ గన్‌ చేతపట్టి వారిని చెదరగొట్టారు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై దాడి జరగడం ఇదే తొలిసారి. గతంలో రాజకీయ నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇంటిపైకి వచ్చి దాడి చేయడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. దాడి నేపథ్యంలో జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేసీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.

సోషల్‌ మీడియాలో వచ్చిన మెసేజ్‌తో తనకు సంబంధం లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ తన ఇంటిపై దాడిచేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన ఇంటిపై దాడి చేశారని విమర్శించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డితో మాట్లాడుదామని జేసీ ఇంటికి వెళ్లానన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దాడి చేయాల్సిన ఉద్దేశం తమకు లేదన్నారు.