Rains: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ‘దానా’
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారింది ‘దానా’. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. ఒడిశా పరాదీప్‌కు 260 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమైంది.
ధమ్రాకు 290 కి.మీ దూరంలో తుపాను ఉంది. అలాగే, బెంగాల్ సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను ఉంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు తీరందాటే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
బుధవారం సాయంత్రానికి ముంపు ప్రాంతాల్లో 10 లక్షల మందిలో 30 శాతం మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.
‘దానా’ ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కోల్‌కతా సహా బెంగాల్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో తూర్పు, దక్షిణ రైల్వేలో 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు.
ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ బంగాళాఖాతం తీర ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోనూ వాతావరణంపై ప్రభావం పడనుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.