D. Raja: భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం: డి.రాజా
బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ విధానాలకు అనుగుణంగా చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.

D Raja
బీజేపీ కుల, మతాల విభజన ఆధారంగా పాలన చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. సీపీఐ రాష్ట్ర మహా సభల్లో పాల్గొనేందుకు విజయవాడకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు. అయినా చంద్రబాబు, నితీశ్ కుమార్ సహకారంతో అధికారంలోకి వచ్చారని తెలిపారు.
ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోదీ మోసం చేశారని అన్నారు. అయినా చంద్రబాబు వారికే మద్దతు ఇచ్చారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఇతర ప్రాజెక్టులకు మోదీ నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ విధానాలకు అనుగుణంగా చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.
అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా మోదీ రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తున్నారని అన్నారు. అదానీ అనేక రూపాలలో వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పారు. దీనిపై మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని అన్నారు. దేశ్ బచావ్, బీజేపీ హఠావ్ అనే నినాదంతో సీపీఐ ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు.
పంజాబ్-చండీగఢ్‌లో వచ్చే ఏడాది సెప్టెంబరులో సీపీఐ జాతీయ మహా సభలు జరుగుతాయని తెలిపారు. డిసెంబరు 26న సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని అన్నారు. శత వసంతాల సీపీఐ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రైతులు, కార్మికులు, ప్రజల పక్షాన నిలబడిన పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ ఏడాది కాన్పూర్‌లో సీపీఐ శత వసంతాల సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏడాది పాటు అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.
జోగి రమేశ్ లాంటి నేతలను పార్టీలో చేర్చుకోకూడదు: టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్