పంచాయతీ ఎన్నికలు, పురోహితులకు ఫుల్ డిమాండ్

పంచాయతీ ఎన్నికలు, పురోహితులకు ఫుల్ డిమాండ్

Updated On : February 4, 2021 / 11:04 AM IST

demand priests : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే..పురోహితులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎన్నికలకు, పురోహితులకు ఏం సంబంధం అని అనుకుంటున్నారు కదూ..శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమితో శుభకార్యాలేవీ జరగడం లేదు. దీంతో పురోహితులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే..ఎన్నికల ప్రక్రియ ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పురోహితులను ఆశ్రయిస్తున్నారు. ఏం టైంలో నామినేషన్ దాఖలు చేయాలో చెప్పాలంటూ..వారిని అడుగుతున్నారు. అంతేగాకుండా..తాము గెలుస్తామా ? లేదా ? తమ జాతకం ఎలా ఉందో..తెలపాలని కోరుతున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది.

తొలి విడతలో 3 వేల 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ పదవులకు 18 వేల 168, ఆయా గ్రామాల్లో వార్డు పదవులకు 77 వేల 554 నామినేషన్లు ఆమోదం పొందాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నచోట ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నచోట అభ్యర్థులకు క్రమపద్ధతిలో ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు.

మరోవైపు రెండో విడతలో 3 వేల 327 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతో పాటు 33 వేల 562 వార్డు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటలతో రెండో విడత నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. గ్రామాల్లో దాఖలయ్యే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి వీలుగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌ రూపొందించింది. తొలివిడతకు ఈనెల 9న, రెండో విడతకు ఈనెల 13న పోలింగ్‌ జరుగనుంది.