Deputy CM Pawan Kalyan : అడవి ఏనుగులకు చెక్.. కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Deputy CM Pawan Kalyan : . పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులకు చెరుకు గెడలను ఆహారంగా అందించి, పూలమాలలు వేసి వాటిని సాగనంపారు.
Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటపొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల సమస్యను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కుంకీ ఏనుగులను రంగంలోకి దింపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా.. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. కుంకీ ఏనుగులకు చెరుకు గెడలను ఆహారంగా అందించి, పూలమాలలు వేసి వాటిని సాగనంపారు.
ఈ రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు తరలించనున్నారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే ప్రత్యేక ఆపరేషన్ను అటవీశాఖ అధికారులు చేపట్టనున్నారు. జయంత్, అభిమన్యు గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొని విజయవంతంగా అడవి ఏనుగులను నియంత్రించిన అనుభవం ఉండటంతో వాటినే ముందుగా పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒడిశా నుంచి అడవి ఏనుగులు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి సంయుక్త కార్యాచరణ చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా మరిన్ని కుంకీ ఏనుగులను తీసుకువచ్చి అడవి ఏనుగుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కుంకీ ఏనుగులతోనే అడవి ఏనుగులను అడవిలోకి మళ్లించి రైతుల పంటలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
