ఆరోజు ఎందుకు సీరియస్ అయ్యానంటే..- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.

Deputy Cm Pawan Kalyan : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పవన్ అన్నారు.
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది. కొందరు అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు ఫోన్లకు సరిగా స్పందించడం లేదని మంత్రులు తెలిపారు. అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. నెల రోజుల్లో వ్యవస్థను గాడిలోకి తీసుకొద్దాం అని చంద్రబాబు తెలిపారు.
ఇటీవల పోలీసు వ్యవస్థ, హోంశాఖ, లా అండ్ ఆర్డర్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర గందరగోళం రేపిన పరిస్థితి. పలు దళిత సంఘాలు కూడా పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు ఒక ఆయుధంలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. ఇవన్నీ క్యాబినెట్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చర్చకు వచ్చాయి.
కొంతమంది ఎస్పీలు, ఉన్నతాధికారులు.. ప్రభుత్వం మీద, టీడీపీ నేతలు, అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద పెడుతున్న పోస్టులు, చేస్తున్న వ్యాఖ్యలుపై పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదని.. కింద స్థాయి అధికారులపై నెపం మోపి తప్పించుకుంటున్నారని.. ఈ పరిస్థితుల్లోనే తాను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాబినెట్ అనంతరం జరిగిన పొలిటికల్ చర్చలో సీఎం చంద్రబాబుకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఎస్పీలు.. మంత్రుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు, వారు సరిగా స్పందించడం లేదన్న అభిప్రాయాన్ని కూడా పలువురు మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిని సావదానంగా విన్న సీఎం చంద్రబాబు.. నెల రోజుల్లోగా గాడిలో పెడతానని చెప్పినట్లు సమాచారం.
సోషల్ మీడియా పోస్టులకు తన ఇంటి ఆడబిడ్డలు కంటతడి పెట్టుకోవటం చూసి తట్టుకోలేకపోయాను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఫేక్ పోస్టులతో ఆడబిడ్డలు బయట తిరగలేని పరిస్థితులు ఉంటే సీరియస్ యాక్షన్ ఉండాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. కొన్ని సంఘటనల్లో మహిళ లేదా బాలికపై అత్యాచారం జరిగిందని, జరగలేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చర్చ జరగటం సబబు కాదని క్యాబినెట్ అభిప్రాయపడింది.
అత్యాచారం జరిగిందా లేదా అనే అంశంపై చర్చకు తావు ఇవ్వకుండా బాధితురాలు గౌరవప్రదంగా తిరిగే వాతావరణం కల్పించాలంది. రుషికొండ భవనాలు ఏo చేద్దాం అనే అంశపైనా చర్చ జరిగింది. ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో అందరికీ తెలిసేలా చేద్దామని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం జరిగిన తీరును విద్యార్థులు, యువత, వివిధ వర్గాలకు తెలిసేలా రుషికొండ భవనాలు చూపించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.
మంత్రివర్గ భేటీ తర్వాత రాజకీయ అంశాలపై చర్చ..
* ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై చర్చ
* ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదన్న పవన్ కల్యాణ్
* అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న పవన్ కల్యాణ్
* అందుకే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందన్న పవన్ కల్యాణ్
* జగన్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కీలక చర్చ
* పలు జిల్లాల ఎస్పీలు సరిగా స్పందించట్లేదని మంత్రుల వ్యాఖ్య
* డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారన్న మంత్రులు
* గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు ఆగ్రహం
* సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడికి తెద్దామన్న సీఎం చంద్రబాబు
* అసత్య పోస్టులను ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Also Read : చంద్రబాబులో మళ్లీ 95 నాటి సీఎంను చూస్తామా?