Chandrababu Naidu: చంద్రబాబులో మళ్లీ 95 నాటి సీఎంను చూస్తామా?
తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా.

CM Chandrababu Naidu
అధికారం..ప్రతిపక్షం. రోల్ ఏదైనా..ఆయన మాత్రం పబ్లిక్ లైఫ్‌లో బిజీగానే ఉంటారు. తాను పనిచేస్తారు. తన వెంట ఉన్నవాళ్లు కూడా బాగా పనిచేయాలని కోరుకుంటారు. పనిచేసేవాళ్లను ప్రోత్సహిస్తారు కూడా. ఇదే చంద్రబాబు సక్సెస్ సీక్రెట్ అని చాలామంది టీడీపీ సీనియర్ లీడర్లు చెప్తుంటారు. అలాంటి చంద్రబాబు ఈసారి పవర్‌లోకి వచ్చాక..తాను 95 సీఎంను అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. దీంతో అసలు 95 సీఎం అని బాబు ఎందుకు చెప్తున్నారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
టీడీపీ నేతలకు కూడా సీఎం కామెంట్స్ పూర్తిస్థాయిలో అర్థం కావడం లేదు. 1995, 1999లో వరుసగా రెండుసార్లు సీఎం అయిన చంద్రబాబు.. అప్పట్లో సీఎంలాగా కాకుండా రాష్ట్రాన్ని ఓ సీఈవోలా నడిపించారు. ప్రజల దగ్గరకు పాలన అంటూ తాను ప్రజల్లోకి వెళ్తూ అధికారులు గ్రామాల్లోకి వెళ్లేలా చేశారు. జిల్లాస్థాయి పర్యటనలతో..అధికారులను పరుగులు పెట్టించేవారు. పని విషయంలో పార్టీ నేతలను, క్యాబినెట్ సహచరులను కూడా ఉపేక్షించేవారు కాదు.
ఒకటి, రెండు సార్లు చెప్పడం..తీరు మారకపోతే ఎంతపెద్ద లీడర్‌ను అయినా పక్కకు పెట్టి..మరొకరితో పనిచక్కబెట్టేవారు. అలా సక్సెస్‌ఫుల్ అడ్మినిస్ట్రేషన్‌కు మారుపేరుగా నిలిచారు. అందుకే 95 సీఎంను అంటూ అధికారులకు, మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. పెద్ద వయస్సుకు వచ్చారని, పరిస్థితుల ప్రభావంతో తాను మారిపోయానని అనుకోవద్దని చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు.
నేతలకు స్వీట్ వార్నింగ్స్
లేటెస్ట్‌గా సీఎం చంద్రబాబు.. ఓ మంత్రికి క్లాస్ పీకడం చర్చనీయాంశంగా మారింది. నేతల తీరుతో పార్టీకి, ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా చంద్రబాబు అలర్ట్‌గా ఉంటూ..పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే.. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మంత్రి వాసం శెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది.
పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇచ్చి, గెలిచాక మంత్రిని కూడా చేశామని అన్నారు. అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా.? అంటూ మండిపడ్డారు. సరిగా పనిచేయకపోతే తాను సీరియస్‌గా ఆలోచిస్తానని హెచ్చరించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలెందుకంటూ కూడా మండిపడ్డారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో 9వేల ఓట్లకు గాను 2,630 గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించడం బాబుకు కోపం తెప్పించిందట. అందుకే నువ్వు యువకుడివి. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు రాజకీయాలపై సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేస్తున్నానని అనుకోవద్దంటూనే మందలించారు.
తన బాధ్యత తాను చేస్తున్నానని తెలిపారు. మీకు రోజూ పరీక్షే..పనిచేయకపోతే తానే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని అన్నారు. అంచనాల మేరకు పనిచేయడం లేదని ప్రజలకే చెబుతానంటూ కూడా ఝలక్ ఇచ్చారు. ఈ మాటలు విన్న మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అవుతున్నట్లు టాక్.
వార్నింగ్‌లు ఇందుకేనా?
ఈ సారి అధికారాన్ని చంద్రబాబు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో మంచి చేయాలని..పార్టీ ప్రజల్లో పది కాలాలా పాటు ఉండాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అందుకే తప్పు చేసిన నేతల పట్ల సీరియస్‌గా ఉంటున్నారు. సొంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని..ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. తన మన అనే తేడా లేకుండా ఏదైనా ఉంటే పార్టీ నేతలకు ముఖం మీదే తేల్చి చెప్తున్నారు. ప్రజలకు ఎంత మేలు చేయగలుగుతామో అంత చేస్తాం. కానీ నడుచుకునే మార్గం కూడా బాగుండాలనేది చంద్రబాబు ఆలోచన. నడవడే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని నేతలకు చెప్తూ వస్తున్నారు. అందుకే సరైన రూట్‌లో వెళ్లడం లేదన్న లీడర్లను చీవాట్లు పెడుతూ సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత యాక్షన్‌లోకి వస్తానంటూ కూడా చెప్పేస్తున్నారు.