ఏపీలో మరో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు.. పోటీ చేయాలా? వద్దా అని తేల్చుకోలేకపోతున్న కూటమి..!

రెండు, మూడు రోజుల్లోనే కూటమి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో మరో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు.. పోటీ చేయాలా? వద్దా అని తేల్చుకోలేకపోతున్న కూటమి..!

Updated On : November 6, 2024 / 2:53 PM IST

విజయనగరం జిల్లా పాలిటిక్స్‌ హాట్‌ హాట్‌గా మారాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగడంతో..గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో జిల్లాలో రాజకీయ పార్టీల హడావుడి కూడా మొదలైంది. ఇది వైసీపీ సిట్టింగ్‌ సీటు. మరోసారి తమ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది.

విజయనగరం జిల్లాలో 753 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 548 మంది వైసీపీ ఓటర్లు, 156 మంది టీడీపీ ఓటర్లు, 13 మంది జనసేన, 13 మంది స్వతంత్ర ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి కొంతమంది లోకల్ బాడీస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఆ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఇలా ఎంత మంది వెళ్ళినా ఇప్పటికీ మెజారిటీ వైసీపీకే ఉంది.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా 375 మంది సభ్యుల మద్దతు ఉండాలి. అంటే నూరు శాతం ఓటింగ్ పడినప్పుడు. అలా కాకున్నా 350 ఓట్లు వచ్చినా గెలిచినట్లే. వైసీపీకి ఉన్న 548 మంది బలాన్ని చూసుకుంటే ఉండాల్సిన దానికంటే 200 మంది లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల మద్దతు ఎక్కువగా ఉంది. ఇందులో నుంచి పెద్దసంఖ్యలో ఓటర్లను లాగేస్తే తప్ప కూటమి గెలవడం కష్టం. అందుకే ఓట్లు తక్కువగా ఉన్న సీటులో బరిలోకి దిగాలా.? వద్దా.? పోటీ చేస్తే గెలుస్తామా.? ఒకవేళ ఓడిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయా? అని కూటమి నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నట్లు టాక్.

ఇప్పటివరకు అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రాలేదా?
మెజార్టీ ఉందనే తప్ప వైసీపీ కూడా పెద్ద యాక్టివిటీ చేయడం లేదు. ఇప్పటివరకు అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కీలక నేత బొత్స సత్యనారాయణ సైలెంట్‌గా ఉండటం వైసీపీ నేతలను కలవరపెడుతోందట. ఆయన రంగంలోకి దిగితేనే లోకల్‌ బాడీస్‌ లీడర్స్ పార్టీ వెంట ఉంటారని..మరో నేతకు బాధ్యతలు ఇస్తే చేజారిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బొత్స ఇప్పుడు అమెరికాలో రెస్ట్‌ తీసుకుంటున్నారట. అయితే వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి బొత్స కుటుంబం నుంచే ఉంటారని అంటున్నారు. బొత్స అందుబాటులో లేకపోవడంతో ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసే అంతా చూసుకుంటున్నారని తెలుస్తోంది. టీడీపీ రఘురాజుకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఇప్పటికే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును వైసీపీకి వదిలేసింది కూటమి. బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. మరి విజయనగరంలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆ పార్టీ జిల్లా నేతలు కూడా ఏమీ అనుకున్నారో తెలియడం లేదు. అయితే ఈ సీటును కూడా వైసీపీకి వదిలేస్తే ఎలా అని ఆలోచిస్తున్నారని టాక్. పోటీ పెడితే బలం లేదు కాబట్టి..వైసీపీ సభ్యులను లాగాల్సి ఉంటుంది. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో నిర్ణయం
ఈ నెల 28న విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా ఇరవై రోజులు మాత్రమే ఉంది. ఈ రెండు మూడు రోజుల్లోనే కూటమి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మెజార్టీ ఉంది కాబట్టి వైసీపీ పోటీ చేయడం ఖాయం. అభ్యర్థిగా బొత్స కుటుంబానికి చెందినవారినే దింపుతారా..లేక మరొకరికి అవకాశం ఇస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.

అయితే 2021లో జరిగిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికలకు ముందు రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. రఘురాజుపై వైసీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై అనర్హత వేటు పడింది. జూన్ 3నుంచి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. గెలుపోటములను తేల్చుకునేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి.

Narendra Modi: మై ఫ్రెండ్‌ అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌కి మోదీ శుభాకాంక్షలు