Digital Arrest Scam : వార్నీ.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారు.. కోటికిపైగా కొట్టేశారు.. ముగ్గురు అనుమానితులు అరెస్ట్..
Digital Arrest Scam ఏపీలోని ఓ ఎమ్మెల్యేను బెదిరించి అతని నుంచి కేటుగాళ్లు కోటి రూపాయలు కొట్టేశారు. అసలు విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే..

Digital arrest scam
Digital Arrest Scam : దేశవ్యాప్తంగా రోజురోజుకూ డిజిటల్ అరెస్టు మోసాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాదు.. ప్రజాప్రతినిధులను కూడా కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా.. ఏపీలోని ఓ ఎమ్మెల్యేను బెదిరించి అతని నుంచి కేటుగాళ్లు కోటి రూపాయలు కొట్టేశారు. అసలు విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేస్తున్నారు.
ఏపీకి చెందిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నివాసంలో ఉండగా.. ఈ నెల 10వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. ఎమ్మెల్యే బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ప్రశ్నించాడు. ఆ తరువాత కొద్దిసేపటికి మరో నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. యూనిఫాంలో ఉన్న ఆ వ్యక్తి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విక్రమ్‌గా పరిచయం చేసుకున్నాడు.
ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీల కేసులో మీకు ప్రమేయం ఉంది.. మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ.. ఒక ఉగ్రవాది ఖాతా నుంచి రూ.3కోట్లు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అయ్యాయంటూ నకిలీ పత్రాలు, అరెస్టు వారెంట్లు చూపించి బెదిరించాడు. అంతేకాదు.. మీ బ్యాంక్ అకౌంట్లు పరిశీలించాలి.. అందుకు సహకరించాలి.. ఏ క్షణమైనా అరెస్టు చేస్తామంటూ భయపెట్టాడు. ఈ క్రమంలో పలు దఫాలుగా ఎమ్మెల్యే నుంచి రూ.1.07కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
మళ్లీ కొద్దిగంటల తరువాత మరో రూ.60లక్షలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు. దీంతో మోసపోయినట్లుగా గుర్తించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్.. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో జరిగిన విషయాన్ని వివరించి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు. హరియాణా, ఉత్తరప్రదేశ్ సైబర్ గ్యాంగ్ చేతివాటంగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేటుగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.