దయచేసి ఏపీకి రావొద్దు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 01:06 PM IST
దయచేసి ఏపీకి రావొద్దు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి

Updated On : May 3, 2020 / 1:06 PM IST

కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం(మే 3,2020) అధికారులతో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్  కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని, దయచేసి ఏపీకి రావొద్దని సీఎం జగన్ కోరారు. సరిహద్దుల దగ్గరికి వచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సదుపాయాల కల్పన కష్టమన్న ప్రభుత్వం:
ప్రస్తుతం ఇలా వస్తున్న వలస కూలీలు వేలల్లో ఉంటున్నారని, వారందర్నీ క్వారంటైన్‌ కేంద్రాల్లో పెడుతున్నామని, పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వారందరికి సదుపాయాల కల్పన చాలా కష్టమవుతోందన్నారు. అందువల్ల మిగిలిన వారు సహకరించాలని కోరారు. కరోనా విపత్తు దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండడం క్షేమం అన్నారు. ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక మీ ఇళ్లల్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ప్రజారోగ్యం కోసం ఏపీలో పెద్ద ఎత్తున కరోనా నివారణ చర్యలు చేపట్టినట్టు సీఎం తెలిపారు. ప్రభుత్వం చర్యలకు ప్రజల నుంచి సహకారం కొనసాగాలన్నారు. కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయం అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరారు.

సొంతూళ్లకు వెళ్లేందుకు ఆన్ లైన్ పాసులు:
కాగా వలస కూలీలు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి కేంద్రం ఊరట ఇచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన విద్యార్థులు, వలస కూలీలు ఏపీకి పయనం అయ్యారు. కాగా, విద్యార్థులు, వలస కూలీలు కాని వారు కూడా ఇంటికి వెళ్లేందుకు క్యూ కట్టారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు ఆన్ లైన్ పాసులు ఇస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఉండిపోయిన ఏపీ వాసులు ఆన్ లైన్ పాసులకు అప్లయ్ చేసుకుంటున్నారు. ఈ పరిణామం కూడా ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీలో 1583 కరోనా కేసులు:
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆదివారం(మే 3,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటివరకు 488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది కరోనాతో మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1062.