వైసీపీ కార్యకర్తలపై దాడులు.. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయి.

వైసీపీ కార్యకర్తలపై దాడులు.. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

Updated On : July 19, 2024 / 7:44 PM IST

Jagan Dharna : వైసీపీ కార్యకర్తలపై వరుస దాడుల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. బుధవారం హస్తినలో ధర్నా చేయనున్నారు జగన్. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టనున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలసి ధర్నాకు దిగనున్నారు జగన్.

వినుకొండలో రషీద్ నివాసానికి వెళ్లారు జగన్. రషీద్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం రషీద్ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై వరుస దాడుల అంశాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

”దాడులకు నిరసనగా 24న ఢిల్లీలో ధర్నా. 45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300 పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి” అని జగన్ ఆరోపించారు.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని జగన్ ఆరోపించారు. అరాచక పాలన జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ వాళ్ళు ఎవరినైనా కొట్టొచ్చు, చంపొచ్చు అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. టీడీపీ నేతలు ఎన్ని దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తిరిగి వైసీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

Also Read : మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తామంటున్న మాజీ తెలుగుదేశం నేతలు..! ఎవరా నాయకులు? కారణమేంటి?

”రషీద్ హత్య అత్యంత దారుణం. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా నరికి కిరాతకంగా చంపేశారు. వైసీపీ వాళ్ళని ఇలానే నరుకుతాను అంటూ ఆ వ్యక్తి అంటున్నాడు. మోటార్ బైక్ కాల్చడం వల్ల హత్య జరిగిందని దిక్కు మాలిన కారణాలు చెబుతున్నారు. మోటార్ బైక్ జిలానీది కాదు. ఆసిఫ్ అనే వైసీపీకి చెందిన వ్యక్తిది. ఆసిఫ్ మోటార్ బైక్ కాల్చింది టీడీపీ వాళ్ళే. ఘటన జరిగిన గంటలో వ్యక్తిగత గొడవలని ఎస్పీ స్టేట్ మెంట్ ఇచ్చారు. జిలాన్ అనే ఒక్కడి పైనే కేసు పెట్టడం ఏంటి..? జిలాన్ కు లోకల్ ఎమ్మెల్యేతో సత్సంబంధాలు ఉన్నాయి. లోకల్ ఎమ్మెల్యేపై ఎందుకు కేసు పెట్టడం లేదు?” అని జగన్ ప్రశ్నించారు.