IYR Krishnarao: స్థూలంగా అప్పులు చెయ్యి, పంచు అన్న విధంగా ఏపీ బడ్జెట్ ఉంది: ఐవైఆర్ కృష్ణారావు
పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.

Iyr Krishnaroa
IYR Krishnarao పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ఉందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఏపీ ప్రభుత్వ బడ్జెట్ పై శనివారం వరస ట్వీట్లతో ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించారు. “తిరువళ్ళువారు వ్రాసిన తిరుక్కురల్ గొప్ప గ్రంథం. దాని నుంచి చిదంబరం గారి నుంచి నిర్మలా సీతారామన్ గారి దాక జాతీయస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రస్తావిస్తూ బహుళ ప్రచారానికి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి గారు కూడా తిరుక్కురళ్ నుంచి విస్తృతంగా ప్రస్తావిస్తారు. బుగ్గన గారు ప్రవేశపెడుతున్నది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ప్రస్తావించ తలుచుకుంటే వేమన శతకం నుంచి సుమతీ శతకం దాక, తిక్కన భారతం నుంచి పోతన భాగవతం దాకా తెలుగు గ్రంధాలు ఎన్నో ఉన్నాయి. సముచితంగా వాటిని ప్రస్తావించకుండా తిరుక్కురల్ ప్రస్తావించవలసిన ప్రత్యేక అవసరం అర్థం కావడం లేదు. జగన్ ను పొగడడమే లక్ష్యమైతే రాజరాజనరేంద్రుడు నుంచి కృష్ణ దేవరాయలు, రెడ్డిరాజుల వరకు గొప్పగా పాలించిన రాజులు ఎంతమందో ఉన్నారు”. అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై సెటైర్లు వేశారు కృష్ణారావు.
Also read: Jangareddy Goodem : జంగారెడ్డిగూడెంలో మిస్టరీగా మరణాలు.. ఇప్పటి వరకు 16 మంది మృతి
“ఇక బడ్జెట్లోని ప్రధానమైన పద్దుల అంశానికి వస్తే ఒక విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే. ఈ మధ్య విడుదలైన కాగ్ లెక్క ప్రకారం 21-22 తొమ్మిది నెలలకు రెవిన్యూ లోటు 45900 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్లో మొత్తం21-22 సంవత్సరానికి రెవెన్యూ లోటును రూ.19545 కోట్లుగా చూపెట్టారు. మిగిలిన మూడు నెలలతో కలిపి ఈ రెవిన్యూలోటు రూ.45900 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాదు. దీని అర్థం మిగిలిన మూడు నెలల్లో చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించకుండా ఖర్చులు తగ్గించి చూపి మసిపూసిమారేడు కాయచేసి కృత్రిమంగా రెవెన్యూ లోటును తగ్గించారని.. దీని ప్రభావం 22-23 సంవత్సరం ప్రారంభంలో ఈ బిల్లుల చెల్లింపుతో ప్రారంభంలోనే ఆర్థిక సమస్యలు మొదలవుతాయ”ని కృష్ణారావు పేర్కొన్నారు.
“కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటులను 22-23 ఆర్థిక సంవత్సరానికి రూ.56000 కోట్లుగా చూపెట్టారు. 21-22 ఆర్థిక సంవత్సరానికి ఇదే పద్దు కింద రూ.57930 కోట్లు చూపెడితే వచ్చింది సవరించిన అంచనాల ప్రకారం రూ.43632 కోట్లు. అంటే రూ.14 వేల కోట్లు తగ్గింది. బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి చూపెట్టడం తప్పితే ఇంత మొత్తంలో గ్రాంటులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేదు. కరోనా వలన ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సి వచ్చిందని ఏదో సందర్భంలో ఆర్థిక మంత్రి గారు ప్రస్తావించారు. గవర్నర్ గారి ప్రసంగంలో కరోనా ప్రభావం రాష్ట్ర ఆదాయం పై లేదు అని అన్నారు. గవర్నర్ గారి ప్రసంగం రుజువు చేసే విధంగానే పనుల ఆదాయాలు ఉన్నాయి. ఈ ఒక్క పద్దు లో మాత్రం అంచనాలకు అనుగుణంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవరత్నాల్లో ఒక రత్నాన్ని విస్మరించటం ద్వారా మద్యం ఆదాయం విపరీతంగా పెరుగుతుంద”ని ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Also read: AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?
“రష్యా యుద్ధం మన రాష్ట్ర ఆదాయాలకు కలిసి వచ్చే విధంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. 21-22 సంవత్సరానికి మూలధన వ్యయం రూ.31198 కోట్ల బడ్జెట్ అంచనా కాగా, సవరించిన ఖర్చు రూ.18529 కోట్లు. 22-23 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో ఈ పద్దు క్రింద రూ.30679 కోట్లు చూపెట్టడం కేవలం మభ్య పెట్టడానికేనని కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం బడ్జెట్ బయట ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల వివరాలు ఇవ్వమని 2021 మార్చిలో కాగ్ రాసిన లేఖకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. మన పక్క రాష్ట్రమైన తెలంగాణాలో 21-22 సంవత్సరానికి ఈ ఆఫ్ బడ్జెట్ రుణాలు రూ. 45000 కోట్ల దాకా ఉందని బహిరంగ సమాచారం ఉంది”.
“ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాగ్ కి కూడా ఇవ్వకుండా ఇంత రహస్యంగా ఉంచింది అంటే ఏ స్థాయిలో బడ్జెట్ బయట అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో అర్థం చేసుకోవచ్చని ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. స్థూలంగా అప్పులు చెయ్యి పంచు. ముందస్తు ఎన్నికల ద్వారా అదృష్టం కలిసొచ్చి మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రజాకర్షక స్కీములు అన్నీ బంద్ చేయొచ్చు అనే అజెండాతో తయారైన బడ్జెట్ లు గా ఈ మూడు సంవత్సరాల బడ్జెట్లు కనిపిస్తున్నాయి” అంటూ వరుస ట్వీట్లతో కృష్ణారావు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
#ఆంధ్రరాష్ట్రబడ్జెట్
తిరువళ్ళువారు వ్రాసిన తిరుక్కురల్ గొప్ప గ్రంథం.దాని నుంచి చిదంబరం గారి నుంచి నిర్మలా సీతారామన్ గారి దాక జాతీయస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రస్తావిస్తూ బహుళ ప్రచారానికి తీసుకువచ్చారు.ప్రధానమంత్రి గారు కూడా తిరుక్కురళ్ నుంచి విస్తృతంగా ప్రస్తావిస్తారు.— IYRKRao , Retd IAS (@IYRKRao) March 12, 2022