పోలవరాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతోంది- అంబటి రాంబాబు

చంద్రబాబు లాలూచీపడి పోలవరానికి అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట నిజం.

పోలవరాన్ని భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతోంది- అంబటి రాంబాబు

Updated On : November 1, 2024 / 9:44 PM IST

Ambati Rambabu : చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరానికి తీవ్ర విఘాతం ఏర్పడిందని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాడు వైఎస్సార్ పోలవరం ప్రారంభించారని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పు వల్ల పోలవరం పూర్తి కాకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మారుస్తోందన్నారు. ప్రత్యేక హోదాను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. పోలవరం మొదటి దశ 115.44, సెకండ్ ఫేజ్ 194.6 టీఎంసీ నీరు స్టోరేజ్ చెయ్యాలన్నారు. కానీ పోలవరం మొదటి ఫేజ్ కు మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పారు.

”మొదటి దశ వరకే పరిమితం అయితే ప్రాజెక్ట్ ప్రయోజనాలు దక్కవు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ప్రాజెక్ట్ పై అవగాహన లేదు. పులిచింతల ప్రాజెక్ట్ కూడా దశలవారిగా నీటిని నింపారు. ప్రాజెక్ట్ మాన్యువల్ ప్రకారం దశలవారిగా నీటితో నింపుతారు. ప్రాజెక్ట్ దశలవారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని జలశక్తి నుంచి వచ్చిన లెటర్ కు మా ప్రభుత్వం లెక్కలు పంపింది.

కేంద్ర ప్రభుత్వం చెయ్యాల్సిన ప్రాజెక్ట్ ను మేము చేస్తాం అంటూ చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? డబ్బు కోసమే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మిస్తుందని భావిస్తున్నాం. ఫేజ్ వన్, ఫేజ్ టు నిధుల కోసం పీఎం కార్యాలయానికి లెక్కలిచ్చాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం కోసం చేసిన కృషి ఫలితంగా నిధులు విడుదల అవుతున్నాయి. క్యాబినెట్ మీటింగ్ లో పోలవరం ఒక్క ఫేజ్ కే పరిమితం చేశారు.

చంద్రబాబు లాలూచీపడి పోలవరానికి అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట నిజం. కేంద్రం పోలవరం ప్రాజక్ట్ కోసం అడ్వాన్స్ గా ఇచ్చిన రూ.2,348 కోట్లను చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పమని కేంద్ర జలవనరుల శాఖ అడుగుతోంది” అని అంబటి రాంబాబు అన్నారు.

 

Also Read : త్వరలోనే వైసీపీ నుంచి సీనియర్లు బయటకు రాబోతున్నారు: గంటా శ్రీనివాసరావు