వెస్ట్ గోదావరిలో ఉచిత ఇళ్ల స్థలాల దందా..10tv స్టింగ్ ఆపరేషన్

ఇళ్ల స్థలాల పంపిణీని పండుగలా నిర్వహించేందుకు రెడీ అవుతుంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంది కూడా. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెబుతోంది. అయితే కొందరు వసూల్ రాజాలు మాత్రం ఇదే అదునుగా భావించి అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సాగుతున్న దందాను బయటపెట్టింది 10tv.
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పశ్చిమగోదావరి జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. YSR పుట్టిన రోజున ఇచ్చే ఉచిత ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త వాళ్ల ఆనందాన్ని ఆవిరి చేసింది. ఇంటి స్థలం కావాలంటే డబ్బులు కట్టాల్సిందేనని కొందరు అక్రమార్కులు హుకుం జారీ చేశారు. వసూళ్ల దందా మొదలు పెట్టాలి అనుకోగానే ఒక్కో గ్రామానికి ఒక్కో రేటు నిర్ణయించారు.
ఎలాంటి భయం లేకుండా 20 వేల నుంచి లక్షన్నర వరకు ఒక్కో లబ్ధిదారుడి నుండి వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులు కట్టలేమని చెబుతున్న వారికి ఇంటి స్థలం రాదని బెదిరిస్తున్నారు. దీంతో దిక్కుతోచక చాలామంది అప్పులు చేసి డబ్బులు కడుతున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రెక్కాడితే కానీ డొక్కాడని పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. అయితే.. ఇంత దర్జాగా లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న దందాను బయటపెట్టింది 10tv. ఒకరిద్దరు కాదు అనేక మంది బాధితులు బయటకు వచ్చి తమ బాధను 10tvతో చెప్పుకున్నారు.
తణుకు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని లబ్దిదారుల్ని 10tv కలిసింది. వసూళ్ల దందాలో నిజానిజాల్ని వెలికితీసింది. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టింది. తణుకు మండలంలోని దువ్వ గ్రామంలో 714 మందికి ఇళ్ల స్థలాల కోసం 34 మంది రైతుల దగ్గర 20 ఎకరాలు సేకరించారు. స్థల సేకరణ, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంటి స్థలం ఇవ్వాలి అంటే ఒక్కొక్క లబ్దిదారుడు రూ. 30 వేలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామంలోని అనేక మంది ఇప్పటికే డబ్బులు కూడా కట్టేశారు. వీరిలో కొందరు అప్పులు చేస్తే… ఇంకొందరు తమ మెడలోని పుస్తెలు తాకట్టుపెట్టి అడిగినంతా సమర్పించుకున్నామని వాపోతున్నారు. గృహనిర్మాణ శాఖామంత్రి నియోజకవర్గం పరిధిలోని ఖండవల్లి గ్రామంలోనూ ఈ వసూళ్లు సాగుతున్నాయి. ఒక లబ్దిదారుడి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఉదంతాన్ని 10tv నిఘా కెమెరా చిత్రీకరించింది. లబ్ధిదారుల నుంచి తీసుకున్న డబ్బులకు రశీదు ఇస్తారా అంటూ 10tv ప్రతినిధి ప్రశ్నిస్తే అక్రమార్కులు మాత్రం మాట దాటవేశారు.
ఈ డబ్బులు ఎవరి కోసం తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే… రైతులకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయారు. ఇరగవరం మండలం రాపాక గ్రామంలోనూ ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 60 వేలు వసూలు చేశారు. వీరిలో చాలామంది అప్పులు చేసి కట్టామని వాపోతున్నారు. భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బు సమర్పించుకున్న వాళ్లున్నారు. డబ్బులు కడితే గ్రామానికి దగ్గర్లో ఉన్న స్థలాలు ఇస్తామని… లేకపోతే ఊరి చివరన స్మశానాల వద్ద స్థలాలు ఇస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read: ఏపీలో ఇవాళ రెండో విడత వాహనమిత్ర.. ఆన్ లైన్ ద్వారా అకౌంట్ లో రూ.10 వేలు