Balakrishna : బాలయ్యకు మంత్రి పదవి.. ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కిన అభిమానులు.. వారివద్దకొచ్చి బాలకృష్ణ ఏమన్నారంటే.. వీడియో వైరల్
Hindupur MLA Nandamuri Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన

Hindupur MLA Nandamuri Balakrishna
Balakrishna : టాలీవుడ్ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం చిలమత్తూరు పంచాయితీ తుమ్మకుంటలో రేషన్ కార్డులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వైద్యకళాశాలలను మొండి గోడలకే పరిమితం చేశారని, ఆ ప్రభుత్వానికి ఆయా కళాశాలలపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలో హిందూపురాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుపుతానని అన్నారు.
సోమవారం హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి జడ్పీహెచ్ఎస్‌లో రూ.64లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మూమాట్లాడుతూ.. హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అయితే, బాలయ్య పర్యటనలో అభిమానులు, హిందూపురం టీడీపీ కార్యకర్తలు రచ్చ చేశారు. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్లకార్డులు చేతపట్టుకొని బాలయ్య కారుకు అడ్డుగా వచ్చిన ఆందోళనకు దిగారు.
మంత్రి పదవి తీసుకోవాల్సిందే..
భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ‘బాలయ్య బాబు మంత్రి పదవి తీసుకోవాలి..’, ’ మా కోరిక మేరకు బాలయ్య మంత్రి అవ్వాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. బాలకృష్ణ వారి వద్దకు రావడంతో.. అభిమానులు, కార్యకర్తలు ఆయన్ను ఒక్కసారిగా చుట్టుముట్టి జై బాలయ్య.. జైజై బాలయ్య .. బాలయ్య బాబు మంత్రి పదవి తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వారిని నవ్వుతూ మందలిస్తూ చూద్దాంచూద్దాం అంటూ మళ్లీ తన కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, అబిమానులు, పార్టీ కార్యకర్తలు కారుకు అడ్డుగా ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పి పక్కకు పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మంచి మనస్సున్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ పేర్కొంటున్నారు.
బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ప్లకార్డులతో బాలకృష్ణ కాన్వాయ్ ఎదుట అభిమానుల ఆందోళన#Balakrishna #BalayyaFansProtest #MinisterPostForBalaKrishna #HindupurMLA #10tvTeluguNews pic.twitter.com/snfN7oSW61
— 10Tv News (@10TvTeluguNews) October 13, 2025
నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎనికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయిన అతికొద్ది మందిలో బాలకృష్ణ ఒకరు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలంటూ ఆయన అభిమానులు, కొంతమంది టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే, ప్రాంతాలు, కుల సమీకరణాల కారణంగా బాలయ్యకు మంత్రి పదవి దక్కలేదు. అయితే, బాలయ్య కూడా మంత్రి పదవి తీసుకునేందుకు ఆసక్తిగా లేరని అప్పట్లో వార్తలొచ్చాయి. సినిమాల్లో బిజీబిజీగా ఉన్న బాలయ్య మంత్రి పదవిపై ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది.
ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీలోని కొంతమంది నేతలు బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో నందమూరి ఫ్యాన్స్, హిందూపురం టీడీపీ కార్యకర్తలు బాలయ్య కాన్వాయ్ కు అడ్డువెళ్లి బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. అయితే, బాలకృష్ణ మాత్రం చిరునవ్వుతో వారిని పలుకరిస్తూ చూద్దాం చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజా పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ మంత్రి వర్గంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి బాలయ్య మంత్రి పదవి తీసుకొనేందుకు సిద్ధమవుతారా..? ఒకవేళ బాలయ్య మంత్రి పదవి కావాలంటే.. చంద్రబాబు అందుకు ఒప్పుకుంటారా..? ఒకవేళ చంద్రబాబు ఒప్పుకున్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని పక్కన పెట్టి బాలయ్యకు కేబినెట్లోకి తీసుకుంటారు అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.