Farmers: చినుకు జాడ లేక బీటలు వారుతున్న చేలు.. ఆందోళనలో అన్నదాత.. వర్షాలు కురిస్తేనే..
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Farmer drought
Farmers Worried : తొలకరి పలకరించలేదు. పొలం పులకరించలేదు. విత్తనాలు వేసినా.. అవి పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదు. చినుకు జాడ లేక చేలు బీటలు వారుతున్నాయ్. రుతుపవనాలు (Monsoon) రాక.. రైతులు అయోమయంలో పడ్డారు. కరువు కమ్మేస్తుందేమోనని కలవరపడుతున్నారు. వానల కోసం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) రైతన్నలు ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నా.. అవి పంటలకు చాలడం లేదు. విత్తనాలు(Seeds) పూర్తిగా మొలకెత్తడానికి సరిపోవడం లేదు. పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తేనే.. ఖరీఫ్ సీజన్ (Kharif Season)లో సాగుకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెబుతున్నారు.
రుతుపవనాలు సమయానికొస్తాయని.. వర్షాలు సరిపడా కురుస్తాయనే లెక్కలతో.. విత్తనాలు నాటి పంటలు వేసిన రైతులు.. ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాల కోసం వేచి చూసి.. చూసి.. అదను దాటుతోందనే ఆందోళనలో ముందడుగు వేసిన వాళ్లంతా.. ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటు తెలంగాణలోనూ.. అటు ఏపీలోనూ.. ఇదే పరిస్థితి నెలకొంది. వానాకాలంలో పత్తి, మొక్కజొన్న, కంది, సోయా పంటలు ప్రధానమైనవి. గత సీజన్‌లో అన్నీ కలిపి తెలంగాణలో దాదాపు 65 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. ఈ సీజన్‌లో పత్తి 55 లక్షల ఎకరాలు, మొక్కజొన్న పది లక్షలు, కంది ఎనిమిది లక్షలు, సోయాబీన్ అయిదు లక్షల ఎకరాల్లో పండించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
వరితో పోలిస్తే వీటికి నీటి అవసరం తక్కువ. అందుకే సీజన్ ఆరంభంలోనే విత్తనాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈసారి వర్షాలు సకాలంలో రాక.. 70 శాతం మంది రైతులు పొలం వైపు చూడలేదు. అదును దాటుతుందనే ఆందోళనలో 30 శాతం మంది మాత్రమే.. గత నెలాఖరు నుంచి విత్తడం ప్రారంభించారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. మొక్కజొన్న, కంది, సోయాలను.. మరో ఐదు లక్షల ఎకరాల్లో విత్తారు. ఎకరాకు.. 10 నుంచి 12 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం.. ఇలాంటి రైతులంతా తీవ్రంగా నష్టపోయేలా ఉన్నారు.
Also Read: కేసీఆర్ విధానాలు తప్పు.. దొరల పాలన పోయి ప్రజాపాలన కోసమే ‘గద్దర్ ప్రజా పార్టీ’
ప్రస్తుతం సాగైనవన్నీ వర్షాధార పంటలు. వానలు రాక.. విత్తనాలకు నీరందడం లేదు. కొందరికి బావులున్నా.. ఒకట్రెండు రోజులకు మించి పారించడం లేదు. కొన్ని చోట్ల డ్రిప్ ఇరిగేషన్‌తో నీళ్లు పెట్టినా.. సగం విత్తనాలే మొలకెత్తాయి. కొంతమేరకు మొలకలొచ్చినా పెద్దగా ఎదుగుదల లేదు. మరికొందరు బిందెల్లో నీళ్లు తీసుకొని మొక్కలకు పోస్తూ చెమటోడుస్తున్నారు. ఇంకొందరు ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. వేసిన విత్తనాల్లో ఇప్పటికే సగానికి పైగా మొలకెత్తలేదు. మరో 2, 3 రోజుల్లో వర్షాలు రాకుంటే.. మిగిలిన పంటలూ దక్కడం కష్టమేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వానలు మరో వారం లేటైనా.. విత్తనాలు మొలకెత్తినా.. వాటికి బలం ఉండదని.. పూత, కాతా ఉండదని చెబుతున్నారు.
Also Read: పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా.. విజయవాడతో పాటు ఖమ్మం జిల్లాలోనూ కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. కానీ.. ఇవేవీ.. పంటలకు సరిపోయేంత.. విత్తనాలు మొలకెత్తేంత స్థాయిలో కురవలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే స్థాయిలోనే వర్షాలు కురిశాయి. ఇప్పటికే.. తెలంగాణ గత పదేళ్లలో సెకండ్ హాటెస్ట్ జూన్‌ని చూసింది. మరో 48 గంటల్లో.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాలు తొందరగా కురిస్తే తప్ప.. రైతన్నలకు మేలు జరగదు. లేనిపక్షంలో.. వానలను నమ్ముకొని పంటలు సాగు చేసిన వాళ్లంతా.. తీవ్రంగా నష్టపోక తప్పదంటున్నారు.