రియాక్టర్ పేలుడు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. చంద్రబాబు, జగన్ స్పందన
గాయపడ్డవారికి చికిత్స అందిస్తుస్తున్నామని, ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని కచ్చితంగా..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి 16 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలయ్యాయి. దీనిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడి వివరాలు తెలిపారు.
గాయపడ్డవారికి చికిత్స అందిస్తుస్తున్నామని, ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని కచ్చితంగా చెప్పడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ కార్మిక శాఖ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దళారి వ్యవస్థ మొత్తం విశాఖ పట్నం కేంద్రంగా ఉందని ఆరోపించారు.
ఈఎస్ఐ ఆసుపత్రిలో కూడా చాలా లోపాలు ఉన్నాయని తెలిపారు. థర్డ్ పార్టీ సేఫ్టీ ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అందుతున్న వైద్యంపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: కేటీఆర్ ఫాంహౌస్ వద్దకు వెళ్లి వచ్చాను: మంత్రి కోమటిరెడ్డి