కరోనా బాధితులని తెలిసినా…. చేతులతో ఎత్తుకొని రక్షించారు

  • Published By: murthy ,Published On : August 10, 2020 / 02:12 PM IST
కరోనా బాధితులని తెలిసినా…. చేతులతో ఎత్తుకొని రక్షించారు

Updated On : August 10, 2020 / 2:32 PM IST

విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదం సమయంలో, అధికారులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.



30 నిమిషాల్లో అదుపులో మంటలు
ప్రమాద విషయం తెలిసిన ఐదు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని కేవలం 30 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలతో కలిసి హోటల్‌లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించారు. వారు కరోనా రోగులని తెలిసినా ఏమాత్రం వెరవకుండా వారి ప్రాణాలను కాపాడారు. క్షతగాత్రులు, కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వారిని హుటాహుటిన బందర్‌ రోడ్డులో ఉన్న రమేష్ ఆస్పత్రికి తరలించారు.



తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
అగ్నిమాపక అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించి అరగంటలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక శాఖ డీజీ స్వయంగా ఘటనా స్ధలికి చేరుకుని ప్రమాదం జరగటానికి గల కారణాలను విచారించారు. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వెంటనే దర్యాప్తు చేపట్టారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ అధికారులు సంయుక్తంగా విచారణ చేస్తున్నారు.



కిటికీల అద్దాలు పగలకొట్టి
తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకోవడం.. మెట్లు, లిఫ్ట్‌ మార్గం ద్వారా బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో భవనంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈలోగా ఘటన స్థలికి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు, పోలీసులు కలిసి నిచ్చెన సాయంతో బాధితులను కిందికి దించారు. మూడు రూముల కిటికీ అద్దాలు పగులగొట్టి రోగులను రక్షించారు.



వైద్య శాఖ అలర్ట్‌
ప్రమాదం విషయం తెలియగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ప్రమాదం జరిగిన కోవిడ్‌ సెంటర్‌లో ఎంత మంది రోగులు ఉన్నారు? ఏ ప్రాంతానికి చెందిన వారు? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి వివరాలను రమేష్‌ ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఇతర అధికారులు కూడా స్వర్ణ ప్యాలెస్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.