Konijeti Rosaiah: ఆరుగురు సీఎంల కేబినెట్‌లో.. 15సార్లు బడ్జెట్‌ పెట్టిన ఘనాపాటి

ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.

Konijeti Rosaiah: ఆరుగురు సీఎంల కేబినెట్‌లో.. 15సార్లు బడ్జెట్‌ పెట్టిన ఘనాపాటి

Konijeti Rosaiah (1)

Updated On : December 4, 2021 / 9:29 AM IST

Konijeti Rosaiah: ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించి సమయపాలన, క్రమశిక్షణ, సంస్కారం ఉన్న వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు.

సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పనిచేశారు రోశయ్య. అందులో నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు రోశయ్య. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఎకైక వ్యక్తిగా రోశయ్య పేరిట రికార్డు ఉంది. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా పేరున్న రోశయ్య.. సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో ఆయనకు ఆయనే సాటి.

వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో 2009, సెప్టెంబర్ 3వ తేదీన రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో ఉండి, తర్వాత 2010 నవంబరు 24వ తేదీన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు రోశయ్య.

1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రోశయ్య.