కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్చికి వెళ్తున్న పిల్లలను ఢీకొట్టిన లారీ..నలుగురు చిన్నారులు మృతి

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 08:48 AM IST
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్చికి వెళ్తున్న పిల్లలను ఢీకొట్టిన లారీ..నలుగురు చిన్నారులు మృతి

Updated On : December 15, 2020 / 9:13 AM IST

Four children killed in road accident in Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చర్చికు వెళ్లేందుకు పిల్లలు రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన మినీ లారీ వారిని ఢీకొట్టింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో పదేళ్ల సురేఖ, 11 ఏళ్ల ఝాన్సీ, 12 ఏళ్ల హర్షవర్ధన్‌, వంశీ అనే నలుగురు చిన్నారులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 15మంది పిల్లల్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు డాక్టర్లు రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రామానికి సంబంధించిన చిన్నారులంతా చర్చికి వెళ్లేందుకు
రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణ నుంచి చిత్తూరు వెళ్తున్న మినీ లారీ రోడ్డు దాటుతున్న చిన్నారులను ఢీకొట్టింది. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్రిస్మస్ పండుగ ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరుగడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.