Friends Completed Funerals : జ్వరంతో కన్నుమూసిన స్నేహితుడికి అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Friends Completed Funerals
Friends completed funerals : కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమై పోతున్నాయి. కోవిడ్ సోకిందని తెలియగానే … అయినవాళ్లు సైతం దూరం పెడుతున్నారు. రోజూ వచ్చి పలకరించేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల ఎవరైనా కరోనాతో మరణిస్తే ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలకు కూడా ఎవరూ రావటంలేదు.
ఇలాంటి పరిస్ధితుల్లో తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే … స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కొమరోలు కు చెందిన ప్రైవేట ఉపాద్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల క్రితం రక్త పరీక్ష చేయించగా టైపాయిడ్ అని తేలింది. ఇంటివద్దే ఉండి మందులు వాడుతున్నాడు.కాగా సోమవారం ఉదయం జ్వరంతీవ్రమయ్యింది. ఆ తర్వాత పరిస్ధితి విషమించి కన్నుమూశాడు.
డాక్టర్లు వచ్చి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా గుప్తా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కరోనాతోనే చనిపోయింఉంటాడని ఎవ్వరూ దరిదాపుల్లోకి రాలేదు. ఇరుగు పొరుగు వారు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృధ్ధులైన తల్లితండ్రులు అంతిమసంస్కారాలునిర్వహించే స్ధితిలో లేరు. బిడ్డలు కూడా లేరు.
భార్య ఏమీ చేయలేక రోజంతా సాయం కోసం ఎదురు చూసింది. సమాచారం తెలుసుకున్న స్నేహితులు మానవత్వంతో ముందుకు వచ్చారు. గుప్త స్నేహితులైన వైఎస్సార్ సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ప్రముఖ దినపత్రిక విలేకరి కృష్ణారెడ్డి…సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్ధికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి ఆ కుటుంబానికి అందచేశారు.