AP CMRF నుంచి రూ. 112 కోట్లు కొల్లగొట్టే కుట్ర

ANDHRA PRADESH CM RELIEF FUND : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ సీఎం సహాయ నిధి నుంచి ఏకంగా రూ. 112 కోట్లు కొల్లగొట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేసి డబ్బులను డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కతాలోని మూడు బ్యాంకుల ద్వారా..నగదు మార్చుకొనేందుకు యత్నించారు.
మంగళూరులోని మూడ్ బద్రిశాఖకు రూ. 52.65 కోట్లు, ఢిల్లీలోని సీసీపీసీఐ రూ. 39.85 కోట్ల చెక్కులు వచ్చాయి. కోల్ కతా మోగ్ రాహత్ శాఖకు రూ. 24.65 కోట్ల చెక్కును క్లియరెన్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకుకు సమర్పించారు. కానీ బ్యాంకు అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది.
ఎవరికి తెలియకుండా ఆరా తీశారు. భారీ మొత్తం కావడంతో వెలగపూడిలో ఉన్న ఎస్ బీఐని ఆయా బ్యాంకులు సంప్రదించాయి. బ్యాంకు అధికారుల అప్రమత్తతతో స్కామ్ బట్టబయలైంది. మొత్తం వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీని వెనుక ఎవరున్నారు ? తదితర వాటిపై ఆరా తీస్తున్నారు.