Ganta Srinivasa Rao : జగన్‌ను ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా దాడి చేస్తారా? ఆలయాలను ఇళ్లతో పోలుస్తారా? గంటా శ్రీనివాసరావు
ప్రభుత్వ నిర్మాణాలు చేపడితే వాటికి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా? వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. Ganta Srinivasa Rao - Pawan Kalyan

Ganta Srinivasa Rao (Photo : Twitter)
Ganta Srinivasa Rao – Pawan Kalyan : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత దాడులకు దిగడం కరెక్ట్ కాదన్నారు.
వారాహి యాత్రలో భాగంగా జరుగుతున్న అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తున్నారు అందులో తప్పేముందని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మాట్లాడిన అంశాల గురించి పవన్ ప్రస్తావిస్తున్నారని చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దాడి చేయడం దారుణం అన్నారు.
”విశాఖలో 128.5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు, దీనిపైన పవన్ కల్యాణ్ మాట్లాడారు అందులో తప్పేముంది? పవిత్రంగా ఆరాధించే కొండల మీద దేవాలయాలను సిగ్గులేకుండా ఇళ్లతో పోలుస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాలు చేపడితే వాటికి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ ప్రభుత్వం 98.5శాతం విఫలమైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు” అని గంటా శ్రీనివాసరావు అన్నారు.
చంద్రబాబు నిర్వహించే విజన్ 2047 డాక్యుమెంటరీ సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ నేతలు పరిశీలించారు. దేశంలో ఉన్న విజనరీ డాక్యుమెంట్ రూపకర్త చంద్రబాబు అని గంటా శ్రీనివాసరావు ప్రశంసించారు. మొదటిసారి నాన్ పొలిటికల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం అని ఆయన తెలిపారు. ఆగస్టు 15న సాయంత్రం విశాఖ బీచ్ రోడ్ లో 2 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని, అనంతరం ఎంజీఎం పార్క్ లో విజన్ డాక్యుమెంట్ ప్రోగ్రాం ఉంటుందని ఆయన వెల్లడించారు. దీనికి మేధావులు, ప్రముఖులు హాజరవుతారని.. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 2047 విజన్ డాక్యుమెంటరీ తెలుగు వారి సత్తా కోసం రూపొందించిందని గంటా తెలిపారు.