భారీ నీటి ప్రవాహంతో పెరుగుతోన్న గోదావరి ఉధృతి.. లంకగ్రామ ప్రాంత ప్రజలకు అలర్ట్
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
godavari heavy flow: ఎగువ నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహంతో గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 11 అడుగులకు చేరింది. వరద ఉధృతి మరింత పెరిగితే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.1 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, లంకగ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ”వరద నీటిలోకి ప్రవేశించవద్దు. కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండండి. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్ద”ని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మూడోసారి శ్రీశైలం డ్యాం గేట్లు లిఫ్ట్
శ్రీశైలం డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. దీంతో ఈ సంవత్సరంలో అధికారులు మూడోసారి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తారు. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం డ్యాం తాజా సమాచారం
ఇన్ ఫ్లో : 1,06,259 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 95,824 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 884.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు
Also Read: విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు షురూ
భద్రాచలంలోనూ పెరుగుతోన్న గోదావరి ఉధృతి
భద్రాచలంలో కూడా గోదావరి ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.80 అడుగులుకి చేరింది. గోదావరి నది నుండి 10,08,802 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 48 అడుగులు దాటితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.