ఇంకా అజ్ఞాతంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఆందోళనలో కార్యకర్తలు.. తాడిపత్రిలో కొనసాగుతున్న హైటెన్షన్
.ఇప్పటికే ఎన్నికల రోజు జరిగిన గొడవలపై చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వైసీపీకే చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దారెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Gossip Garage : ఏపీ పాలిటిక్స్‌లో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం… నిత్యం హీట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఆ నియోజకవర్గం. వ్యూహ ప్రతివ్యూహాలు… ఎత్తుకుపైఎత్తులు… ప్రత్యర్థులకు ముప్పుతిప్పలు పెట్టడం అక్కడి స్టైల్… ఇక రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గ కేంద్రం రావణకాష్టమే అయింది. ఇరు పార్టీల నేతలను నియోజకవర్గం గడప తొక్కొద్దంటూ కోర్టు ఆదేశించింది… ఎన్నికలు ముగిసి రెండు నెలలు అయినా అక్కడి పరిస్థితిలో మార్పులేదు. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరుగుతున్నా… వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే గడపాల్సి వస్తోంది. ఇంతటి వేడివేడి రాజకీయం నడిచే నియోజకవర్గం ఏదో తెలుసా…
తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం అంటే కత్తి మీద సామే..
ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం అంత తేలికైన పనేమీ కాదు. అక్కడి ప్రభుత్వమంటే స్థానిక ఎమ్మెల్యేలే… మంత్రి, ఎంపీ.. జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా మిగిలిన వారంతా నామమాత్రం. అక్కడి ఎమ్మెల్యే చెప్పిందే శాసనం. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తాడిపత్రి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం అంటే కత్తి మీద సామే… నాలుగు దశబ్దాలుగా జేసీ కుటుంబ ఆధిపత్యంలో ఉన్న తాడిపత్రిలో 2019లో తొలిసారి వైసీపీ గెలిచింది. కానీ, ఐదేళ్లుగా ఆ నియోజకవర్గంలో అశాంతి రాజ్యమేలిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల రోజు కూడా హింస చోటుచేసుకుంది. దీంతో ప్రత్యర్థులుగా తలపడిన టీడీపీ, వైసీపీ అభ్యర్థులను నియోజకవర్గానికి దూరంగా ఉండాలని ఆదేశించింది న్యాయస్థానం.
ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి..
ఇక ఎన్నికల ఫలితాలు విడుదలై… టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ వారసుడు అస్మిత్‌రెడ్డి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అస్మిత్‌రెడ్డి విజయోత్సవం మాత్రం తాడిపత్రిలో చేసుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన హింసతో అస్మిత్‌రెడ్డిపై ఈసీ కేసులు నమోదు చేసింది. దీంతో కొన్ని రోజులు ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితాలు వచ్చిన 20 రోజుల తర్వాత కోర్టు అనుమతితో మాత్రమే తాడిపత్రికి వెళ్లారు అస్మిత్‌రెడ్డి. అదే విధంగా అస్మిత్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డిపైనా కోర్టు అంక్షలు విధించింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న ప్రభాకర్‌రెడ్డి వృద్ధాప్యకారణాలు, అనారోగ్యంతో తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు.
తాడిపత్రికి దూరంగా ప్రభాకర్ రెడ్డి..
ప్రభాకర్‌రెడ్డి సోదరి మరణించడంతో ఒకసారి తాడిపత్రి వచ్చినా, పోలీసులు నోటీసులివ్వడం రాజకీయంగా అలజడి రేపింది. ఐతే ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డికి ఈ నెల 14 వరకు బెయిల్ ఇవ్వడంతో అనంతపురంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కారణమేదైనా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభాకర్‌రెడ్డి… టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎక్కువగా గడపలేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఇంకా అజ్ఞాతంలోనే పెద్దారెడ్డి..
మరోవైపు కాస్త ఆలస్యమైనా నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి యాక్టివ్‌గా తిరుగుతున్నారు. 14వ తేదీ వరకు కోర్టు బెయిల్ పొడిగించడంతో అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ, ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన పెద్దారెడ్డి మాత్రం ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో అస్మిత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డికి కోర్టు మినహాయింపునిచ్చింది. ఈ నెల 14 వరకు వారిపై ఆంక్షలు తొలగించడంతోనే ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ, ఇలాంటి మినహాయింపులేవీ లేని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుని జేసీ కుటుంబం తాడిపత్రిలో తిరుగుతుండగా, పెద్దారెడ్డికి మాత్రం ఇప్పటివరకు ఊరట లభించలేదు.
ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్..
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తాడిపత్రిలో చక్రం తిప్పిన పెద్దారెడ్డి… ఎన్నికల తర్వాత అజ్ఞాతంలో గడపాల్సిరావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో జేసీ కుటుంబాన్ని అనేక రకాలుగా టార్గెట్ చేశారు పెద్దారెడ్డి. జేసీ కుటుంబ వ్యాపారంతోపాటు టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోవడం, సుమారు 50 రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో తాడిపత్రి వైసీపీ కార్యకర్తలు ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ పడుతున్నారు.
వైసీపీలో కీలకంగా పనిచేసిన వారంతా అండర్ గ్రౌండ్‌కు..
ఇప్పటికే ఎన్నికల రోజు జరిగిన గొడవలపై చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వైసీపీకే చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దారెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జేసీ కుటుంబం రివర్స్ ఆపరేషన్ ప్రారంభిస్తే… ఎన్ని చిక్కులు పడాల్సి వస్తుందోననే టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి యాక్టివ్ కావడం, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అందుబాటులో లేకపోవడంతో వైసీపీలో కీలకంగా పనిచేసిన వారంతా అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారంటున్నారు. దీంతో తాడిపత్రి రాజకీయం ఇంకా వేడివాడిగానే కొనసాగుతోంది. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియక… తాడిపత్రిలో హైటెన్షనే కనిపిస్తోంది.
Also Read : ఆ భయంతో నిద్రలేని రాత్రులు..! నాడు చక్రం తిప్పిన నాయకులు నేడు ఏమైపోయారు?