ఆ భయంతో నిద్రలేని రాత్రులు..! నాడు చక్రం తిప్పిన నాయకులు నేడు ఏమైపోయారు?

జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు...

ఆ భయంతో నిద్రలేని రాత్రులు..! నాడు చక్రం తిప్పిన నాయకులు నేడు ఏమైపోయారు?

Updated On : July 8, 2024 / 11:35 PM IST

Gossip Garage : మేం చెప్పిందే వేదం అన్నట్లు ఐదేళ్లు అధికారం చలాయించారు. ఎంతటివారైనా తమ ఆదేశాలకు జీ హుజార్‌ అన్నట్లే శాసించారు. ఎన్నికల్లో రివర్స్‌ రిజల్స్‌ రాగానే అంతా గప్‌చుప్‌ అయ్యారు. ప్రజలకే కాదు.. తమను నమ్మి వెంట తిరిగిన కార్యకర్తలకు సైతం ముఖం చాటేస్తున్నారు. మరోపైపు అధికార పక్షం గతాన్ని తవ్వుతుండటంతో ఎవరు బుక్కైపోతారో తెలియక క్యాడర్‌ చెట్టుకొకరు… పుట్టకొకరు అన్నట్లు చెల్లా చెదురవుతున్నారు. తమకు తిరుగే లేదన్నట్లు సిక్కోలు వైసీపీలో చక్రం తిప్పిన నేతలు ఏమైపోయారు? వారి కోసం క్యాడర్‌ వెతుకులాటలో ఇంట్రస్టింగ్‌ అంశమేంటి?

క్యాడర్‌కు కనిపించకుండా తిరుగుతున్నారనే విమర్శలు..
ఏపీ రాజకీయాల్లో సిక్కోలు పాలిటిక్స్‌ సెపరేట్… ఈ జిల్లాలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది… గేట్ వే ఆఫ్ ఆంధ్రా సిక్కోలులో నిత్యం అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతుంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఐతే 2019 ఎన్నికల్లో మాత్రం సిక్కోలు ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడూ టీడీపీ తప్ప, మరోపార్టీ గెలవని నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరేసింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు.
వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు… తాజా ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్‌కు కనిపించకుండా తిరుగుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఎన్నో కీలక పదువులిచ్చినా ఘోరంగా ఓడిపోయారు..
ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు ఉండగా, 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉండే వారు. టీడీపీ కంచుకోటైన జిల్లాలో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించడంతో పదవుల్లోనూ పెద్దపీట వేసింది వైసీపీ. స్పీకర్ పదవితోపాటు, డిప్యూటీ సీఎం, రెండు మంత్రి పదవులను కట్టబెట్టింది. సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్‌ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు. ఇక పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కూడా నాలుగున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు. టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకర్గాలకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. ఐతే ఇన్ని కీలక పదువులిచ్చినా గత ఎన్నికల్లో ఒక్కరూ గెలవలేకపోయారు. టీడీపీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

కేసుల్లో ఇరుక్కుంటామనే టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు..
ఇలా ఓటమి మూటగట్టుకున్న నేతలు… ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరిద్దరు తప్ప, ఏ ఒక్కరూ బయటకు రావడం లేదు. ఫలితాలు విడదులై నెల రోజులు దాటుతున్నా, ఓటర్లు ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో నేతల ప్రోద్బలంతో దూకుడుగా వ్యవహరించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు… టీడీపీ అధికారంలోకి రావడం, విచారణల పేరుతో పాత సంగతులు తవ్వితీస్తుండటంతో కేసుల్లో ఇరుక్కుంటామనే టెన్షన్‌తో కార్యకర్తలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అధికారంలో ఉండగా తమను వాడుకున్న నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం, కష్ట సమయంలో ఆదుకుంటామనే భరోసా కూడా ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు.

నాడు దూకుడు చూపిన వారు ఇప్పుడు అండ కోసం ఎదురుచూపులు..
గతంలో అధికారం అండతో దూకుడు చూపిన వారు ఇప్పుడు అండ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపిన మాజీ మంత్రి ధర్మాన ఎన్నికల తర్వాత ఎక్కడున్నారో తెలియదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న ధర్మాన ఘోరంగా ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అప్పుడప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ స్పీకర్‌ తమ్మినేని… నెల రోజుల తర్వాత 8వ తేదీ సోమవారం బయటకు వచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో దూకుడుగా పనిచేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ నెల రోజులుగా ముఖం చూపలేదు. ఎన్నికల ముందు భార్య దువ్వాడ వాణితో గొడవ పడిన దువ్వాడ.. మంత్రి అచ్చెన్నాయుడి చేతిలో మరోసారి ఓడిపోయారు. ఇక అధికారంలో ఉన్నన్నాళ్లూ గ్రూప్‌ వార్‌తో రచ్చ చేసిన ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శాంతి ఆచూకీ తెలియడం లేదని అక్కడి కేడర్‌ అంటున్నారు.

భవిష్యత్‌పై తీవ్రమైన ఆందోళన..
రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు రాజకీయ బదిలీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తలె రాజేశ్‌… ఓటమి తర్వాత బయటకు రాలేదు. ఇచ్ఛాపురంలో పోటీ చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ… పదవీగండంతో బెంగపెట్టుకున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన సమయంలోనే వేరొకరికి జడ్పీ పీఠం ఇవ్వాలని మెలిక పెట్టింది పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవక, ఉన్న పదవి పోగొట్టుకుని రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు పిరియా విజయ.

దిక్కుతోచని స్థితిలో కార్యకర్తలు..
మొత్తానికి శ్రీకాకుళం వైసీపీ రాజకీయం గందరోగళంగా మారింది. ఓటమి వేదన నుంచి బయటపడని నేతలు క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వం పట్టు బిగిస్తుండటంతో కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Also Read : షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే- ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు